డ్వాక్రా మహిళల నుంచి రూ.100 చొప్పున వసూలు
మధ్యస్థాయి అధికారుల ద్వారా డ్వాక్రా సంఘాలకు హుకుం
సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఆడియో టేప్
సాక్షి, అమరావతి: ‘రాజధాని అమరావతి కడతాం.. సంపద సృష్టిస్తాం’ అంటూ గొప్పలు చెప్పుకొంటున్న బాబు కూటమి ప్రభుత్వం.. కేంద్రం నుంచి నిధులు రాబట్టలేకపోయింది. గతంలో ఇటుకలమ్మి సేకరించిన విరాళాలు మరుగున పడ్డాయి. ఇప్పుడు రాజధాని భారాన్ని రాష్ట్ర ప్రజలపై వేస్తోంది. వివిధ వర్గాల ప్రజల నుంచి బలవంతపు వసూళ్లకు తెగబడుతోంది. చివరికి రూపాయి రూపాయి పొదుపు చేసుకొని, కుటుంబానికి అండగా నిలుస్తున్న స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) అక్కచెల్లెమ్మలనూ వదలడంలేదు. ప్రతి మహిళా వందేసి రూపాయలు అమరావతి కోసం ఇవ్వాల్సిందేనంటూ కొందరు అధికారుల ద్వారా హుకుం జారీ చేయిస్తోంది.
ఇదే విధంగా ఓ మధ్యస్థాయి అధికారి డ్వాక్రా మహిళలను ఆదేశిస్తున్న వీడియో టేప్ ఒకటి బయటపడింది. ఈ టేపు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ‘అమరావతి రాజధాని కోసం ఒక్కొక్క సభ్యురాలు రూ. వంద చొప్పున కలెక్షన్ చేయాలి. ప్రతి ఒక్కరూ.. గ్రూపు లీడర్ కూడా సంఘ సభ్యురాలు దగ్గర... సంఘంలో ఎంత మంది ఉన్నారో, అంతమంది మనిషికి వంద రూపాయల చొప్పున కలెక్టన్ చేయండి. నేను చాలా వరకు గ్రూపు లీడర్లకు ఫోన్లు చేశాను. ప్రతి గ్రూపు లీడరు ఫాలోఅప్ చేయండి.
రేపు సాయంత్రంకల్లా కలెక్షన్ చేసి మాకు ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్ని సంఘాలు ఇచ్చారన్నది మేం సీవో (మెప్మా విభాగంలో పట్టణ ప్రాంతాల్లో పనిచేసే కమ్యూనిటీ ఆర్గనైజర్)కు అప్పజెప్పాలి. ప్రతి సభ్యురాలు ఎందుకు.. ఏమిటి అని అడగొద్దు. ప్రతి సంఘ సభ్యురాలు వంద రూపాయలు ఇవ్వాలి’ అంటూ ఓ పట్టణ ప్రాంతాల్లో డ్వాక్రా సంఘాల కార్యకలాపాలను పర్యవేక్షించే ఓ మధ్య స్థాయి అధికారి ఆయన పరిధిలోని సంఘాల సభ్యులకు జారీ చేసిన ఆదేశాలు ఆ ఆడియో టేపులో ఉన్నాయి.
ఈ ఆడియో టేపులో మాట్లాడిన మాటల ప్రకారం.. ఇప్పటికే తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పొదుపు సంఘాల సభ్యుల నుంచి రూ. వంద చొప్పున వసూళ్లు పూర్తయ్యాయి. సెర్ప్, మెప్మా ఉద్యోగుల చర్చల్లోనూ ఈ విషయం బయటపడింది.
బహిరంగంగానే చెప్పిన చిత్తూరు ‘మెప్మా’
ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం చంద్రబాబు తొలిసారిగా సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్లినప్పుడు చిత్తూరు జిల్లాలో మెప్మా అధికారులు ఆ ప్రాంత పొదుపు సంఘాల తరపున అమరావతి నిర్మాణానికి రూ.4.50 కోట్ల విరాళం ప్రకటించారు. ఆ డబ్బు సేకరణ కోసమే అధికారులు, సంఘాల లీడర్లు డ్వాక్రా మహిళలపై ఒత్తిడి తెచ్చి ఒక్కొక్కరి నుంచి రూ.100 చొప్పున ఇప్పటికే వసూళ్లు చేసినట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఇది చిత్తూరు, తిరుపతి జిల్లాలకే పరిమితమవలేదని, మిగతా జిల్లాల్లోనూ వసూళ్లు జరుగుతున్నాయని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment