‘స్టార్’లకు సమయం లేకే..
బాలీవుడ్లో పెద్ద స్టార్లుగా మారిపోయినవారికి సమయం లేకపోవడంతోనే తన చిత్రాలతో కొత్తవారిని పరిచయం చేస్తున్నానని కండలవీరుడు సల్మాన్‌ఖాన్ అన్నాడు. కత్రినాకైఫ్, సోనాక్షి సిన్హా, జరైన్‌ఖాన్ వంటి తారాలను బాలీవుడ్‌కు పరిచయం చేయడం మాత్రమే కాకుండా దక్షిణాది తారలను కూడా కొంతమందిని హిందీ తెరకు పరిచయం చేశాడు. దీనిపై సల్లూభాయ్ మాట్లాడుతూ... కొత్తవారిని హిందీ చిత్రసీమకు పరిచయం చేస్తున్నప్పుడు టాలెంట్ ఉన్నవారికే ప్రాధాన్యతనిస్తున్నా. అంతేకాని వారికి నేను గాడ్ ఫాదర్‌ను కావాలని లేదు. అంతేకాదు నేనెవరిపైనా ప్రత్యేక శ్రద్ధ కనబర్చి వారిని ఈ పరిశ్రమకు తీసుకురావడంలేదు. ఎవరితోనైనా నాకు సంబంధముందంటే వారిని నేను ఇష్టపడుతున్నాననే అర్థం. వారితో కలిసి పనిచేయడానికి కూడా వెనుకాడను.
ఇదంతా పెద్ద స్టార్లకు తేదీలు కుదరకపోవడంతోనే. ఎవరో నాకు అవకాశం ఇచ్చారు. నేనెందుకు ఇతరులకు అవకాశం ఇవ్వకూడదు? ఎవరిపట్లయినా నాకు నమ్మకం కలిగి, వారిలో టాలెంట్ ఉందని గుర్తిస్తే వారిని పరిశ్రమకు పరిచయం చేయడానికి ఏమాత్రం వెనుకాడను. ఇక పరిచయం చేశాక వచ్చే ఆరోపణలు, విమర్శల గురించి నేను పెద్దగా పట్టించుకోన’ని అన్నారు. సల్మాన్ హీరోగా తాజాగా తెరకెక్కిన ‘జై హో’ చిత్రంతో కూడా డైసీ షాను పరిచయం చేశాడు. ఆమెకు జూనియర్ ఆర్టిస్టుగా అనుభవం కూడా ఉంది. అంతేకాక కొరియోగ్రాఫర్‌గా కూడా కొంత అనుభవముంది. దీంతో ఆమెను సల్లూభాయ్ తన చిత్రం ద్వారా పరిచయం చేశాడు. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు సల్మాన్ పైవిధంగా చెప్పుకొచ్చాడు.