రాష్ట్రంలో అరాచక పాలన
శివమొగ్గ, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నాయంటూ స్వతహాగా ముఖ్యమంత్రి సిద్దరామయ్య బహిరంగంగా పేర్కొన్నారని, రాష్ట్రంలో అరాచక స్థితి నెలకొందని స్వాతంత్య్రం వ చ్చిన తరువాత రాష్ట్ర ప్రజలు ఇలాంటి పనికిమాలిన ప్రభుత్వాన్ని చూడలేదంటూ ముఖ్యమంతి సిద్దరామయ్యపై మాజీ సీఎం బీఎస్.యడ్యూరప్ప ఆరోపణలు గుప్పించారు.
శనివారం దైవజ్ఞ కళ్యాణమంటపంలో లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శివమొగ్గ గ్రామాంతర విధానసభ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల సమావేశాన్ని యడ్యూరప్ప ప్రారంభించిన అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ... సంఘ వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టి ప్రజలకు రక్షణ కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. అన్ని విషయాల్లో విఫలమైన హోం మంత్రిని తొలగించి మరొకరిని నియమించాలని కోరారు.
గుల్బర్గ ఎస్ఐ మల్లికార్జనబండె మృతిపై ముఖ్యమంత్రి పైనే అనువ ూనం ఉందన్నారు. స్వతహాగా బండె సతీమణి తమ భర్త చావుకు సీనియర్ పోలీసులే కారణమని ఆరోపించారు. బండె మృతి విచారణను సీబీఐకి అప్పగించడానికి ఎందుకు ఒప్పుకోవడం లేదని, సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి కుంటుబడిందని ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయని ఆరోపించారు.
అభివృద్ధి కావాలంటే నరేంద్రమోడీ దేశ ప్రధాని కావాలన్నారు. ఈ సారి కూడా గత ఎన్నికల కంటే ఎక్కువ స్థానాల్లో సాధించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంబీ.బానుప్రకాష్, రాజ్యసభ సభ్యుడు అయనూరు మంజునాథ్, మాజీ ఎమ్మెల్యే కేజీ.కుమారస్వామి, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ అధ్యక్షురాలు సీ.శాంత తదితరులు పాల్గొన్నారు.