దేశవ్యాప్తంగా ఐపీపీబీలు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్(ఐపీపీబీ)లను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర పోస్టల్ కార్యదర్శి బీవీ సుధాకర్ వెల్లడించారు. శుక్రవారం డాక్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2017 సెప్టెంబర్ నాటికి జిల్లాకు ఒకటి చొప్పున సుమారు 650 బ్యాంక్ శాఖలు ప్రారంభించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. బ్యాంకులకు వాటి పరిధిలోని పోస్టాఫీసులను అనుసంధానించనున్నట్లు పేర్కొన్నా రు. కేంద్రం అమలు చేస్తున్న నగదు బదిలీ (డీబీటీ) పథకంలో ప్రభుత్వం, వినియోగదారుడికి మధ్య సేవలందించనుందన్నారు.
కొత్తగా ఏర్పాటు చేసే బ్యాంకు పాలనాయంత్రాంగం కోసం 3,500 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. పోస్టల్ శాఖ ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు ఇటీవల జాతీయ సర్వీస్ కాల్ సెంటర్‌ను ప్రారంభించామని, టోల్‌ఫ్రీ నంబర్ 1924కు ఫోన్ చేస్తే 24 గంటల్లోగా ఫిర్యాదులపై స్థితిగతులు అందించే విధంగా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. గ్రామీణ డాక్ సేవలో ఖాళీగా ఉన్న సుమారు 55 వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. పోస్టల్ శాఖ సోలార్ విద్యుత్ వినియోగంపై దృష్టి సారించినట్లు సుధాకర్ వెల్లడించారు. పోస్టల్ భవనాలకు సోలార్ విద్యుత్ వినియోగిస్తే ఖర్చు తగ్గించుకోవచ్చని అంచనా వేసినట్లు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 13,800 కోట్ల ఆదాయాన్ని గడించాలని లక్ష్యంగా నిర్ణయించా మన్నారు. సమావేశంలో ఏపీ సర్కిల్ సీజీఎం సంపత్, రాధిక చక్రవర్తి పాల్గొన్నారు.