తెలంగాణ గడ్డ స్వర్ణభూమిగా మారాలి
కామారెడ్డి/కామారెడ్డిటౌన్: తెలంగాణ గడ్డ స్వర్ణభూమిగా మారాలని, గోదారమ్మ పరవళ్లతో ఇక్కడి నేలల్లో బంగారు పంటలు పండాలని శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి అన్నారు. కామారెడ్డిలో సోమవారం రాత్రి అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డిలో ఈ నెల 31న జరగనున్న మహాస్వర్ణాభిషేకంతో ఈ ప్రాంతం పునీతం కానుందన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది నాలుగుకోట్ల రతనాల తెలంగాణ వజ్రాల తెలంగాణగా మారాలన్నారు.
కోతి నుంచి మనిషి పుట్టాడని చాటిచెప్పిన డార్విన్ దార్శనికుడని కొనియాడారు. ఆయనకు మన పురాణాలు అంది ఉంటే తన భావనలను పూర్తిగా మార్చుకుని ఉండేవాడన్నారు. అనంతరం దశావతారాలను గురించి ప్రబోధించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ షబ్బీర్అలీ పాల్గొని, అసాంతం ఆసక్తిగా విన్నారు. ఆయనను పరిపూర్ణానంద అభినందిస్తూ శాలువతో సన్మానించారు. ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికతను ప్రబోధిస్తూ ఆదరాభిమానాలను చూరగొన్న పరిపూర్ణానంద కామారెడ్డికి వచ్చి ఐదురోజుల పాటు ప్రవచించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని ఎమ్మెల్సీ షబ్బీర్అలీ అన్నారు. మహాపడిపూజ నిర్వాహకులను అభినందించారు.
హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు
కామారెడ్డి: లౌకికవాదమనే నినాదాన్ని తలకెత్తుకున్న పాలకులు మతం ముసుగు ధరించారని శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి విమర్శించారు. సోమవారం కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులిద్దరూ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల వారు క్రిస్మస్ వేడుకల సందర్భంగా చేసిన ప్రకటనలు ఆశ్చర్యానికి గురిచేశాయన్నారు.
క్రైస్తవం తీసుకున్న దళితులకు దళిత రిజర్వేషన్ బిల్లు తెస్తామంటూ ఏపీ సీఎం అంటున్నారని, ఇది ఎంత మాత్రం ఆ మోదించతగినది కాదన్నారు. ఆదాయ వనరులు ఉండే హిందూ దేవాలయాలపై పెత్తనం చేస్తున్నారని మండిపడ్డారు. కొన్ని వర్గాల వారు ఓట్లేస్తేనే వారు అధికారంలోకి వచ్చారా? అని ప్రశ్నించారు. ఇద్దరు సీఎంలు మేధాసంపత్తి కలవారని, స్వలాభం, ఓట్ల కోసం మతాలను కలుషితం చేయొద్దని, మతాల అస్తిత్వాన్ని దెబ్బతీయొద్దని కోరారు.