70 ఏళ్ల తర్వాత క్షవర యోగం!
సంబాల్: దాదాపు 70 ఏళ్లుగా అగ్రవర్ణాల ఆధిపత్యం, వివక్షతో క్షవరానికి దూరమైన దళిత వాల్మీకీలు ఎట్టకేలకు అనుకున్నది సాధించారు! తమకు క్షవరం చేయకపోతే ఇస్లాం మతంలోకి మారతామని హెచ్చరించడంతో అగ్రవర్ణాలు దిగొచ్చాయి. సమస్య పరిష్కారం కోసం పోలీసులు, ఇతర అధికారులు కూడా జోక్యం చేసుకున్నారు. దీంతో గ్రామంలోని క్షురకులు వాల్మీకీలకు మంగళవారం హెయిర్ కటింగ్, షేవింగ్ చేయడంతో కథ సుఖాంతమైంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్లోని సంభాల్ జిల్లా ఫతేపూర్ షాంషోయ్ గ్రామంలో అగ్రవర్ణాల ఆదేశం వల్ల వాల్మీకీలకు క్షవరంపై 70 ఏళ్లుగా నిషేధం కొనసాగుతోంది.
వారికి వాడే ‘అపవిత్ర, అపరిశుభ్రమైన’న రేజర్లను తమకు వాడితే క్షవరాలు చేయించుకోబోమని అగ్రవర్ణాలు బెదిరించాయి. దీంతో క్షురకులు వాల్మీకీలకు క్షవరం చేయడం లేదు. మరోదారి లేక బాధితులు ఆ సేవల కోసం 15–20 కి.మీ. దూరంలోని చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లేవారు. అయితే నెల కిందట గ్రామంలోని అసిఫ్ అలీ అనే క్షురకుడు వాల్మీకీలకు క్షవర కర్మలు చేసేందుకు ముందుకొచ్చాడు. కొందరు వాల్మీకీలకు క్షవరం చేశాడు. అయితే అగ్రకులాల వ్యక్తులు అతనిపై దాడి చేయడంతో వాల్మీకీలకు క్షవరం చేయడానికి నిరాకరించాడు. తమకు క్షవరం చేయకపోతే ఇస్లాం మతం పుచ్చుకుంటామని బాధితులు హెచ్చరించారు. మంగళవారం సంబంధిత వర్గాల ప్రజలు మాజీ సర్పంచి సంజీవ్ శర్మ మధ్యవర్తిత్వంలో పోలీసులు, అధికారులతో చర్చలు జరిపారు.