నేడు తెలంగాణ బంద్కు దళిత జేఏసీ పిలుపు
రోహిత్ మృతికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ మృతికి బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ దళిత సంఘాల జేఏసీ గురువారం తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది. ఏబీవీపీ నాయకులు, కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీ, వీసీ అప్పారావుల వేధింపుల వల్లే రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఇది ముమ్మాటికీ హత్యేనని పేర్కొంది. దీనిపై పూర్తి విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది.
బుధవారమిక్కడ జేఏసీ చైర్మన్ ఈదుల పరశురాం, టీఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు బజ్జొ శ్రీధర్, బహుజన శ్రామిక సమితి రాష్ట్ర అధ్యక్షుడు గందమల్ల యాదగిరి, తెలంగాణ దళిత బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్రావు తదితరులు విలేకరులతో మాట్లాడారు. రోహిత్ మృతికి నిరసనగా గురువారం తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలను మూసివేస్తున్నట్లు తెలిపారు.