ఈడీ సమన్లను కొట్టేయండి
హైకోర్టుకు సుప్రీం సీనియర్ న్యాయవాది చిదంబరం
ఈడీ సమన్లపై దాల్మియా సిమెంట్స్ ప్రతినిధుల పిటిషన్లు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో సీబీఐ కోర్టులో విచారణ జరుగుతుండగానే ఈడీ అధికారులు జారీ చేసిన సమన్లను కొట్టేయాలని దాల్మియా సిమెంట్ కంపెనీ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. వీరు దాఖలు చేసిన వ్యాజ్యాలను శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్పుర్కర్ విచారించారు. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హోదాలో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం వాదనలు వినిపించారు.
కేసు దర్యాప్తులో ఉన్నప్పుడు ఈడీ జారీ చేసిన సమన్లను గౌరవించి పిటిషనర్లు వ్యక్తిగతంగా హాజరై దర్యాప్తునకు సహకరించారని తెలిపారు. కేసుకు సంబంధించి సీబీఐ కోర్టులో విచారణ జరుగుతుండగానే, ఈడీ అధికారులు పిటిషనర్లకు మళ్లీ సమన్లు జారీ చేశారని, ఇది నిబంధనలకు విరుద్ధమన్నారు. నేరం మోపినప్పుడు నిరూపించాల్సిన బాధ్యత కూడా ఈడీపైనే ఉందన్నారు.
నిందితులుగా ఉన్న వ్యక్తికి సమన్లు జారీ చేయరాదని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పలు తీర్పుల ద్వారా స్పష్టం చేసిందన్నారు. ఈడీ పిటిషనర్లకు జారీ చేసిన సమన్లను కొట్టేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ రాజగోపాల్ వాదనలు వినిపించేందుకు వీలుగా విచారణను ఈ నెల 16కు వాయిదా వేశారు.