దాల్మియా పిటిషన్లపై ముగిసిన వాదనలు
తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో సీబీఐ కోర్టులో విచారణ జరుగుతుండగానే ఈడీ అధికారులు జారీ చేసిన సమన్లను కొట్టేయాలని కోరుతూ దాల్మియా సిమెంట్ కంపెనీ ప్రతినిధులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో బుధవారం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు పునిత్ దాల్మియా తరఫు న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ...
మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ ఈసీఐఆర్ దాఖలు చేసిందని, ఇందులో పిటిషనర్‌ను నిందితుడిగానే పేర్కొందని తెలిపారు. ఈ నేపథ్యంలో విచారణ సమయంలో మౌనంగా ఉండే హక్కు పిటిషనర్‌కు చట్టబద్ధంగా లభించిందని వివరించారు. ఈడీకి కేవలం విచారణ చేపట్టే అధికారమే ఉంది తప్ప, సీబీఐలాగా సమన్లు జారీ చేసే అధికారం లేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.