అర్ధరాత్రి కానిస్టేబుళ్ల వీరంగం
పలమనేరు, న్యూస్‌లైన్: శాంతి భద్రతలు కాపాడాల్సిన వారే బాధ్యతలు మరిచారు. తప్పతాగి హోటల్లో ఫర్నిచర్‌ను ధ్వంసంచేశారు. స్నేహితులతో కలసి ఫూటుగా మద్యం సేవించిన ఇద్దరు పోలీసులు శుక్రవారం రాత్రి పలమనేరు పట్టణంలో హంగా మా సృష్టించారు. సంఘవిద్రోహుల నుంచి కాపాడాల్సిన వారే అర్ధరాత్రి రౌడీల్లా వ్యవహరించారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల హత్య కు గురైన ఇద్దరు కానిస్టేబుళ్ల కేసు విచారణకు సంబంధించిన విధుల్లో వీరు ఉండడం గమనార్హం.
గంగవరం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంకటేష్, పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో పనిచేస్తున్న సీఐ జీపు డ్రైవర్ పురుషోత్తం ఇటీవల హత్య కు గురైన ఇద్దరు కానిస్టేబుళ్ల హత్య కేసు విచారణకు సంబంధించి పలమనేరుకు వచ్చారు. ఇద్దరూ స్నేహితులతో కలసి శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో పట్టణంలోని రాయలసీమ హోటల్‌కెళ్లారు.
అప్పటికే మద్యం మత్తులో ఉన్నా తిరిగి మద్యం సేవించారు. ఎంతసేపైనప్పటికీ వారు వెళ్లలేదు. హోటల్ మూసేసే సమయం అయింది కనుక బయటకు వెళ్లాలని హోటల్ యజమాని కోరారు. దీంతో మద్యం మత్తులో ఉన్న పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము పోలీసులమని, తమనే హోటల్ నుంచి బయటకు వెళ్లమంటావా అని ఆగ్రహంతో ఊగిపోయారు. హోటల్లోని కుర్చీలు, టేబుళ్లను ధ్వంసం చే శా రు. దీంతో ఆందోళనకు గురైన హోటల్ యజమాని ఏం చేయాలో అర్థంగాక మిన్నకుండిపోయారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన వారు రోడ్లపై అరుస్తూ నానా హంగామా సృష్టిం చారు. గుడియాత్తం రోడ్డు సర్కిల్లో పలు వాహనాలను ఆపి డ్రైవర్లను చితకబాదారు.
అర్ధరాత్రి దాకా హల్చల్ సృష్టించారు. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం గమ నార్హం. కానిస్టేబుళ్ల దాడిలో హోటల్లోని రూ.1.5 లక్షల ఫర్నిచర్ ధ్వంసమైందని బాధితుడు రాజారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కావడంతో వారిపై ఫిర్యాదు చేయడానికి జంకుతున్నారు. కానిస్టేబుళ్ల వీరంగం పట్టణమంతా పొక్కడంతో డీఎస్పీ, సీఐలు హోటల్ యజమానిని పిలిపించి పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని చెప్పి చేతులు దులుపుకున్నారు.