మాయమాటలు... క్యాటరింగ్ పేరుతో అశ్లీల నృత్యాలు
సాక్షి, విజయవాడ : క్యాటరింగ్ పనుల పేరుతో ఓ మైనర్ బాలికతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నఇద్దరు వ్యక్తులను సింగ్ నగర్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వివరాలు.. నగరంలోని సింగ్ నగర్ కు చెందిన దుర్గేశ్వరి కుమార్తె ఏడో తరగతి వరకు చదివింది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో చదువు మానేసి ఇంట్లోనే ఉంటోంది. దీంతో అదే ప్రాంతానికి చెందిన ఓ కేటరింగ్ సంస్థ నిర్వాహకుడు మోనీ తన వద్ద పని చేసేందుకు కూతురును పంపాల్సిందిగా దుర్గేశ్వరిని కోరాడు. కేటరింగ్ పనుల కోసం బాలికను 20 రోజుల కిందట విజయవాడ నుంచి తూర్పుగోదావరి జిల్లాకు తీసుకెళ్ళాడు.
మాయమాటలు చెప్పి అనకాపల్లికి చెందిన రికార్డింగ్ డ్యాన్స్ నిర్వాహకులు మైనర్ బాబు, సంధ్యలకు బాలికను అప్పగించాడు. అప్పటి నుంచి బాలికను తమ ట్రూప్లోని ఇతర యువతులతో కలిపి బలవంతంగా అశ్లీల నృత్యాలు చేయించడం మొదలు పెట్టారని పోలీసులు తెలిపారు. 20 రోజుల పాటు నరకం అనుభవించిన బాలిక ఆ గ్యాంగ్ నుండి తప్పించుకుని విజయవాడకు చేరుకుందనీ, అదేక్రమంలో బాలిక తల్లి కూడా తన కుమార్తె ఆచూకీ లభించడం లేదని ఫిర్యాదు చేసిందని సింగ్ నగర్ పోలీసులు వెల్లడించారు. ఈలోగా బాలిక కూడా ఇంటికి చేరడంతో.. విషయం తెలుసుకున్న పోలీసులు డాన్స్ ట్రూప్పై దాడి చేసి నిర్వాహకులు మైనర్ బాబు, సంధ్యలను అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో ప్రమేయమున్న మిగతావారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.