గిన్నిస్ పుటల్లో రోబో బ్రేక్ డ్యాన్స్..
షాన్డాంగ్ః బీర్ ఫెస్టివల్ లో రోబోల బ్రేక్ డ్యాన్స్ చూపరులను అమితంగా ఆకట్టుకుంది. చైనాలో జరిగిన బీర్ ఫెస్టివల్ సందర్భంగా 1007 రోబోలు ఏకకాలంలో వినూత్నంగా బ్రేక్ డ్యాన్స్ చేసి, విశేషంగా ఆకర్షించడమే కాదు గిన్నిస్ రికార్డును కూడా సాధించాయి.
చైనా షాన్డాంగ్ రాష్ట్రంలోని క్విండగో సిటీలో ఎవర్ విన్ కంపెనీ బీర్ ఫెస్టివల్ నిర్వహించింది. ఈ వేడుకలో భాగంగా మొత్తం 1007 రోబోలు బ్రేక్ డ్యాన్స్ చేసి చూపరులను కట్టిపడేశాయి. క్యూఆర్సీ-2 పేరున్న43.8 సెంటీమీటర్లు అంటే సుమారు 19 అంగుళాల పొడవుండే ఒకేసైజులోని రోబోలు మొబైల్ ఫోన్ కంట్రోల్ తో ఏకకాలంలో ఒకేరీతిలో డ్యాన్స్ చేయడం విభిన్నంగా ఆకట్టుకుంది. మొత్తం 60 సెకన్లలో అద్భుతంగా డ్యాన్స్ చేసి అలరించిన రోబోలు రికార్డును కైవసం చేసుకున్నాయి. వేడుకలో భాగంగా ఎవర్ విన్ కంపెనీ తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందుకు ప్రయత్నించింది.
రోబోల అద్భుత నృత్య ప్రదర్శనను ప్రత్యక్షంగా తిలకించి, గిన్నిస్ రికార్డు అర్హతను ధృవీకరించేందుకు కార్యక్రమానికి రోబో అసోసియేషన్ సాంకేతిక నిపుణుడు, గిన్నిస్ వరల్డ్ రికార్డు నిర్ణేత ఎంజెలా వు హాజరయ్యారు. సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి పరచిన రోబోలు విభిన్నంగా డ్యాన్స్ చేసి.. వినూత్నంగా చూపరులను ఆకట్టుకున్నాయి. ప్రపంచ రికార్డును సాధించి గిన్నిస్ పుటలకెక్కాయి. ఇటువంటి వేడుకలు మరిన్ని నిర్వహిస్తామని రోబో ఫెస్టివల్ నిర్వహించిన ఎవర్ విన్ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. రోబో బ్రేక్ డ్యాన్స్ కు ముగ్ధులైన చిన్నారులు సైతం ఫెస్టివల్ లో సందడి చేశారు.