ఫిర్యాదు వస్తే పండగే!
డీపీవోలో అక్రమాల దందా విచారణతోనే సరి చర్యలకు కాసులతో బంధం
కరీంనగర్ సిటీ : ‘గంగాధర మండలం కొండన్నపల్లి సర్పంచ్ అవినీతికి పాల్పడ్డారంటూ గత సంవత్సరం గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై 2015 నవంబర్ 9వ తేదీన డీఎల్పీవో విచార ణ కోసం నోటీసు జారీ చేశారు. అదే నెల 18వ తేదీన గ్రామంలో డీఎల్పీవో విచారణ చేపట్టి, రికార్డులు సీజ్ చేసి తీసుకెళ్లారు. సుమారు రూ.9 లక్షల నిధుల్లో రూ.55 వేలు దుర్వినియోగం అయినట్లు నిర్ధారిస్తూ 2016 జనవరి 5వ తేదీన డీఎల్పీవో తన నివేదికను డీపీవో కార్యాలయానికి పంపించారు.’ కాని ఇప్పటివరకు దీనిపై ఎలాంటి చర్య తీసుకున్న దాఖలాలు లేవు. విచారణలో డబ్బులు స్వాహా చేసినట్లు నిర్ధారణ అయినా ఎందుకు చర్యతీసుకోవడం లేదంటూ గ్రామస్థులు సోమవారం మరోసారి డీపీవోను కలిసి ఫిర్యాదు చేశారు.
ఇది జిల్లాలో సర్పంచుల అక్రమాలపై విచారణ పేరుతో జరుగుతున్న తంతుకు ఒక ఉదాహరణ మాత్రమే. సర్పంచులపై ఫిర్యాదు వచ్చిందంటే చాలు డీపీవో కార్యాలయంలో కాసులు కురుస్తున్నాయనే ఆరోపణలున్నాయి. పంచాయతీ జిల్లా కార్యాలయంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ ఉద్యోగి ఈ వ్యవహారాల్లో చక్రం తిప్పుతున్నాడనేది బహిరంగ రహస్యం. ఫిర్యాదు రావ డం, డీఎల్పీవో విచారణ చేయడం సాధారణంగా జరిగేదే అయినా.. నివేదిక రాగానే సదరు ఉద్యోగి రంగ ప్రవేశం చేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్పంచ్ సదరు ఉద్యోగిని ‘కలవగానే’ డీఎల్పీవోలు ఇచ్చిన నివేదికలు అటకెక్కుతుండడం ఇక్కడ పరిపాటి. కొండన్నపల్లి గ్రామస్థులు మరోసారి డీపీవోను కలిసి ఎందుకు చర్యతీసుకోవడం లేదని ప్రశ్నించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.
కాని సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్, గంగాధర, జమ్మికుంట తదితర మండలాల్లోని పలు గ్రామాల్లోనూ ఇదే తతంగం చోటుచేసుకుందనే విమర్శలున్నాయి. ఎవరైనా ప్రజాప్రతినిధి వెంటపడితే అక్కడక్కడా సర్పంచుల చెక్పవర్లో కోత విధించి చేతులు దులుపుకుంటున్నారు తప్ప కఠిన చర్యలు మాత్రం తీసుకున్న దాఖలాలు లేవు. వీటికి కారణం డీపీవో కార్యాలయంలో చక్రం తిప్పే సదరు ఉద్యోగి అండదండలు సదరు సర్పంచులకు ఉండడం కారణమనే ప్రచారం ఉంది. జిల్లాలో సర్పంచులపై వచ్చిన ఆరోపణలు, డీఎల్పీవోల విచారణ నివేదికలు, ఎంతమందిని దోషిగా తేల్చారు, ఎందరిపై చర్యతీసుకున్నారనే అంశాలపై కలెక్టర్ దృష్టిసారిస్తే అవినీతి, అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉంది.