జన శిరమున.. జల దీవెన
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఇటు అంత్య పుష్కరం.. అటు శ్రావణం.. ఎటు చూసినా ఆధ్యాత్మిక శోభ పరిఢవిల్లింది. సౌభాగ్య ధాత్రి ఆశీస్సుల కోసం సతులంతా గోదారమ్మ ఒడిలో జలకమాడారు. గౌరీ కటాక్షం కోసం శ్రావణ శుక్రవారం పూజలు ఆచరించారు. గండాలను, పాపాలను కడిగేయగా.. మూడు మునకలే చాలుగా అంటూ భక్త జనమంతా జల దీవెనను తలకు పోసుకున్నారు. జననీ.. గంగాభవానీ అంటూ.. ఆ పావన వాహినిని కీర్తించారు.
శ్రావణ మాసం తొలి శుక్రవారం శోభ గోదావరి అంత్య పుష్కరాల్లోనూ కనిపించింది. పుష్కర స్నానాల అనంతరం భక్తులంతా సమీపంలోని అమ్మవార్ల ఆలయాలను దర్శించుకున్నారు. నదిలో వరద ప్రవాహం పెరగడంతో కొన్నిఘాట్లను మూసివేయాల్సిన పరిస్థితి తలెత్తింది. నిండుగా ప్రవహిస్తున్న గోదావరిని నిండైన భక్తితో కొలిచి చల్లగా చూడాలని మొక్కుతూ భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో సుమారు 13 వేల మంది భక్తులు స్నానాలు ఆచరించారు. శుక్రవారం కూడా నరసాపురంలోని ఘాట్లలో భక్తుల రద్దీ కొనసాగింది. వలంధర రేవులో వేకువజాము నుంచే భక్తులు స్నానాలు ఆచరించారు. కొవ్వూరు వద్ద గోదావరి ఉగ్రరూపంతో ఉంటే నరసాపురంలో మాత్రం ప్రశాంతంగా దర్శనమిచ్చింది. నదిలో తగినంత నీరు లేక భక్తులు ఇబ్బంది పడ్డారు. సముద్రానికి దగ్గరగా ఉండటంతో ఆటుపోట్ల ప్రభావం ఈ ఘాట్‌పై ఉంటుంది. అంత్యపుష్కరాల ప్రారంభం నుంచీ నరసాపురం గోదావరిలో పాటు సమయంలోనూ భక్తులు స్నానాలకు ఇబ్బంది పడేంతగా నీటిమట్టం తగ్గలేదు. శుక్రవారం మాత్రం ఉదయం 6 గంటల నుంచి 7.30 గంటల వరకూ నీటిమట్టం దారుణంగా పడిపోయింది. దీంతో జల్లు స్నానాలపై ఆధారపడాల్సి వచ్చింది. ఆచంట మండలం కోడేరు, పెదమల్లం, కరుగోరుమిల్లి, భీమలాపురం ఘాట్ల వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పెదమల్లంలో మాచేనమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్ధాంతం కేదారీఘాట్‌లో ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో గోదావరి మాతకు లక్ష కుంకుమ పూజ నిర్వహించారు. గోదారమ్మకు పసుపు కుంకుమలు సమర్పించి హారతులిచ్చారు. కుంకుమ పూజల్లో 108 మంది మహిళలు పాల్గొన్నారు. కేదారీఘాట్‌లో 6వ రోజున 6వేల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించిట్టు అధికారులు లెక్కగట్టారు.
ప్రమాదకర ఘాట్ల మూసివేత
గోదావరిలో వరద ప్రవాహం పెరగడంతో కొవ్వూరులోని పాత పుష్కర ఘాట్‌ను మూసివేశారు. గత ఏడాది పుష్కరాల్లో విస్తరించిన నూతన ఘాట్లలో మాత్రమే అనుమతించారు. పెరవలి మండలంలోని ఖండవల్లి, కానూరు అగ్రహారం, ముక్కామల, ఉమ్మిడివారిపాలెం, కాకరపర్రు గ్రామాల్లోని 6 ఘాట్లు మూతపడ్డాయి.