వెదురు కర్రలతో నిరుద్యోగానికి చెక్ పెట్టింది
కేప్ టౌన్:
నిరుద్యోగ సమస్యను ఒక్క ఆలోచనతో తాను అధిగమించడమే కాకుండా, మరి కొందరికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకుంది ఘనాకు చెందిన ఓ యువతి. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకున్న దపా.. తనకు అందుబాటులో ఉన్న వనరులతోనే పరిష్కారాన్ని కనుగొంది.
తన సొంత ఊరైన దక్షిణ ఘనాలోని కుమాసి గ్రామంలో విరివిగా లభించే వెదురు కర్రలతో సైకిళ్లను తయారు చేయడంపై దృష్టి పెట్టింది. వెంటనే ఘనాలో బాంబూ బైక్స్‌ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్‌కు విశేష స్పందన వస్తోంది. ఘనాలోనే కాకుండా చుట్టు పక్కల దేశాల్లో కూడా వెదురు సైకిళ్లకు మంచి గుర్తింపు లభించింది. 1000 సైకిళ్లకు పైగా ఘనాతో పాటు యూరోపియన్, అమెరికా దేశాల్లో అమ్ముడు పోయాయి.
ఇప్పటివరకు 35 మంది యువకులు ఆమె దగ్గర వెదురు కర్రలతో సైకిళ్లు తయారు చేయడంపై శిక్షణ తీసుకున్నారు. మిగతా ప్రాంతాల్లో కూడా వర్క్‌షాపులు ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇవ్వనున్నట్టు ఆమె తెలిపారు. తమ దేశంలో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉందని, ఈ ఆలోచనతో మరికొంత మంది యువతకు ఉపాధి కల్పించగలగడం చాలా ఆనందాన్నిస్తుందని దపా అన్నారు. ఈ సైకిళ్లు తక్కువ ధరకే లభించడంతో పాటు పర్యవరణానికి మేలైనవని... మన్నికలోనూ వెదురు కర్రలతో చేసిన సైకిళ్లు దృఢమైనవని ఆమె పేర్కొన్నారు.