కృష్ణశక్తి అభూతకల్పనేనా?
లండన్: మొత్తం విశ్వంలో దాదాపు 68 శాతం ఆవరించి ఉందని చెబుతున్న కృష్ణశక్తి(డార్క్ ఎనర్జీ) అభూతకల్పన అయి ఉండవచ్చని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 1920 నుంచి గెలాక్సీల వేగాన్ని గమన్నిస్తున్న శాస్త్రవేత్తలు విశ్వం తన పరిధిని విస్తరిస్తుందని కనుగొన్నారు. విశ్వం చిన్న బిందువు దగ్గర ప్రారంభమైందని వారంటున్నారు.
20వ శతాబ్దం ద్వితీయార్థంలో శాస్త్రవేత్తలు గెలాక్సీల్లోని నక్షత్రాల కదలికలకు అవసరమైన కంటికి కనిపించని కృష్ణ పదార్థాన్ని(డార్క్ మేటర్) కనుగొన్నారు. మొత్తం విశ్వంలో 27 శాతం కృష్ణపదార్థం ఉందని అంచనా. 1990ల్లో మరుగుజ్జు నక్షత్రాల పేలుళ్లపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు మొత్తం విశ్వంలో 68 శాతం కృష్ణశక్తి ఉందని, విశ్వం తన పరిధిని పెంచుకోవడంలో ఇదే సహాయపడుతుందని తెలిపారు. గత 20 సంవత్సరాలుగా ఖగోళ శాస్త్రవేత్తలు, భౌతిక శాస్త్రవేత్తలు కృష్ణశక్తి తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నా అది మాత్రం ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది.