ఉగ్రవాదుల నిలయంగా హైదరాబాద్: కిషన్ రెడ్డి
హైదరాబాద్: ఉగ్రవాదులకు నిలయంగా హైదరాబాద్ మారిందని బీజేపీ ఎల్పీ నేత కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మతత్వ పార్టీ మజ్లిస్ ఉగ్రవాదులకు అండగా ఉంటోందని ఆరోపించారు. అటువంటి పార్టీతో అధికారి టీఆర్ఎస్ జట్టు కట్టడం బాధాకరమని వ్యాఖ్యానించారు.ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ఉగ్రవాదానికి మద్దతు తెలపడం సిగ్గుచేటని కిషన్ రెడ్డి విమర్శించారు. మయన్మార్, సుడాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు చెందిన దాదాపు 10 వేల మంది అక్రమంగా నగరంలో నివసిస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడ ప్రభుత్వం నుంచి అన్ని సదుపాయాలు పొందుతూ దేశ ద్రోహానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఇక పోలీసు యంత్రాంగాన్ని పాలక పార్టీ తమ సొంత ఆర్మీలా వాడుకుంటోందని కిషన్ రెడ్డి మిమర్శించారు. ధర్నాచౌక్ లో నిరసన కారులుగా పోలీస్ అధికారులను వాడడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ పెద్దలు చెప్పడం వల్లే ఆ అధికారులు అలా వ్యవహరించారని దానిలో వారి తప్పేమి లేదన్నారు. అందుకు ప్రభుత్వ పెద్దలను సస్పెండ్ చేయాల్సింది పోయి, వాళ్లు చెప్పినట్లు చేసిన సీఐపై చర్యలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. పొట్టకూటికోసం ఉద్యోగం చేసుకునే కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవడం కేసును తప్పుదోవ పట్టించడమేనని వ్యాఖ్యానించారు.