జైలర్ వేధింపులు..ఖైదీల ఆందోళన
చర్లపల్లి జైళ్లో ఖైదీల ఆందోళన
హైదరాబాద్: నగరంలోని చర్లపల్లి సెంట్రల్ జైలు డిప్యూటీ జైలర్ దశరథం వేధింపులకు గురిచేస్తున్నాడంటూ.. జైళ్లోని ఖైదీలు ఆందోళనకు దిగారు. భోజనం సరిగ్గాలేదని నిరసన తెలిపిన మల్లేశం అనే ఖైదీపై కక్ష కట్టిన జైలర్ దశరథం అతన్ని చర్లపల్లి నుంచి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించడానికి యత్నిస్తున్నారు.
దీంతో ఆగ్రహించిన ఖైదీలు గురువారం జైల్లో ఆందోళన చేపట్టారు. చర్లపల్లి జైలు సూపరిండెంట్ దశరథం అవినీతి పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విచారించాలని ఖైదీలు వేడుకుంటున్నారు. ఆయన ఖమ్మం సెంట్రల్ జైలు నుంచి చర్లపల్లి జైలుకు ఓ.డి పై వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఖైదీలను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారు. జైళ్ల శాఖ డీజీ వి.కే సింగ్ తాను ఎలా చెబితే అలా వింటాడని ఓ వైపు జైలు సిబ్బందిని మరో వైపు ఖైదీలను తరచూ వేధింపులకు గురి చేస్తున్నారు.
జైలర్ వేధింపులు తాళలేక గతంలో ఓ ఖైదీ ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. జీవిత ఖైదు అనుభవిస్తున్న మల్లేషం పై జైలర్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఆయన అవినీతి, అక్రమాలను ప్రశ్నించిన జైలు సిబ్బంది, ఖైదీలపై జైళ్ల శాఖ డీజీకి తప్పుడు ఫిర్యాదు చేసి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దశరథం పై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఖైదీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.