దాసరి పరిస్థితి మళ్లీ ఇబ్బందికరం?
ప్రముఖ దర్శక నిర్మాత, నటుడు దాసరి నారాయణరావు ఆరోగ్య పరిస్థితి మరోసారి ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం ఆయనకు కిమ్స్ ఆస్పత్రిలో డయాలసిస్ కొనసాగుతోంది. గతంలో సుదీర్ఘ కాలం పాటు దాసరి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొంది, తర్వాత డిశ్చార్జి కాగా, వారం రోజుల క్రితం మరోసారి ఆస్పత్రిలో చేరారు. మూడు రోజుల క్రితం ఆయనకు మరోసారి సర్జరరీ అయినట్లు తెలుస్తోంది. అయితే శరీరంలోని పలు భాగాలకు ఇన్ఫెక్షన్ సోకడంతో పరిస్థితి ఎలా ఉందన్నది తెలియడం లేదు. గతంలో ఆయనకు గ్యాస్ట్రిక్ బెలూన్ సర్జరీ చేశారు. సర్జరీ తర్వాత కొన్ని శరీర భాగాలు దెబ్బతిన్నాయని చెబుతున్నారు. ఆయన డయాలసిస్‌కు ఎలా స్పందిస్తున్నారో చూసిన తర్వాతే హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఉదయం నుంచి బీపీలో కూడా హెచ్చుతగ్గులు ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారంటున్నారు.
కిడ్నీలకు ఇన్ఫెక్షన్ సోకితే మాత్రం ఒకరకంగా ఆందోళనకరమైన అంశంగానే భావించాల్సి ఉంటుందని కొందరు సన్నిహితులు చెబుతున్నారు. ఆయనను కాపాడేందుకు వైద్యులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. డయాలసిస్ నెమ్మదిగా సాగే ప్రక్రియ కాబట్టి వైద్యులు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటి తర్వాత హెల్త్ బులెటిన్ రావచ్చని అంటున్నారు. దీనిపై టాలీవుడ్‌కు చెందిన కొందరు నిర్మాతలు కూడా స్పందించారు. ఆయన పరిస్థితి కష్టంగానే ఉందంటున్నారు. అన్నవాహికకు రంధ్రాలు పడటంతో ఇన్ఫెక్షన్ సోకిందని చెబుతున్నారు. అయితే ఇవేవీ అధికారిక సమాచారాలు మాత్రం కావు. ఆయన సన్నిహితులు, మిత్రులు చెప్పిన విషయాలు మాత్రమే. కిమ్స్ ఆస్పత్రి వైద్యులు సమగ్రంగా చెబితే తప్ప ఈ విషయాలను పూర్తిగా నిర్ధారించుకోలేము. ఇటీవలే ఆయన తన జన్మదినాన్ని చాలా వైభవంగా జరుపుకొన్నారు.