జయజయహే జగన్మాత
నేత్రపర్వంగా మూలా మహోత్సవం
వేడుకల్లో పాల్గొన్న పుష్పగిరి, తొగుట పీఠాధిపతులు
అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
వర్గల్: వర్గల్ విద్యాధరి క్షేత్రం శనివారం భక్తులతో పోటెత్తింది. శంభుని కొండ దేవీ నామస్మరణతో మార్మోగింది. మహా సరస్వతి రూపిణి అయిన అమ్మవారు నవరత్న ఖచిత స్వర్ణ కిరీటంతో భక్తులను కటాక్షించారు. దసరా శరన్నవరాత్రోత్సవాల్లో ఎనిమిదో రోజు శనివారం ఈ మహోత్సవ ఘట్టం ఆవిష్కతమైంది.
వర్గల్ క్షేత్రంలో శనివారం మూలా నక్షత్ర మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పుష్పగిరి, తొగుట పీఠాధిపతులు అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొన్నారు. మాజీ గవర్నర్ కె. రోశయ్య, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, గడా అధికారి హన్మంతరావు తదితరులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఓవైపు అర్చనలు, అభిషేకాలు, మరోవైపు సారస్వత మండపంలో భారీగా చిన్నారుల అక్షరాభ్యాసాలతో మూలా నక్షత్ర మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు సామూహిక పుష్పార్చనలో పాల్గొన్నారు.
విశేష పంచామతాభిషేకం..గిరి ప్రదక్షిణం
తెల్లవారు జామున 5.30 గంటలకు ఆలయ వ్యవస్థాపకులు చంద్రశేఖర సిద్ధాంతి నేతృత్వంలో గణపతి పూజతో మూలా నక్షత్ర మహోత్సవానికి తెరలేచింది. గర్భగుడిలో అమ్మవారి మూల విరాట్టుకు వేదమంత్రోచ్ఛారణలతో విశేష పంచామతాభిషేకం నిర్వహించారు.
వివిధ రకాల పూలు, పట్టు వస్త్రాలతో అలంకరించారు. నవరత్న ఖచిత స్వర్ణకిరీటాది ఆభరణాలు ధరింపజేశారు. ఆ వెంటనే ప్రత్యేకంగా అలంకరించిన పూల పల్లకిలో అమ్మవారి ఉత్సవమూర్తిని ఆసీనురాలిని చేశారు. ఉదయం 7.30 గంటలకు ప్రారంభమైన అమ్మవారి గిరి ప్రదక్షిణ ఊరేగింపు రెండు గంటల పాటు కన్నుల పండువ చేసింది.
నేత్రపర్వంగా లక్ష పుష్పార్చన
ఉదయం 10 గంటలకు మూలా పుస్తక రూపిణి సరస్వతి పూజ అనంతరం ఆలయ మహామంటపంలో సువాసినులు బారులు తీరి కూర్చుని అమ్మవారి నామం పఠిస్తూ వివిధ రకాల పూలతో సామూహిక లక్షపుష్పార్చన చేశారు. తరువాత చదువుల తల్లికి మహా పుస్తక పూజ జరిపారు. వేలాది పుస్తకాలను అమ్మకు సమర్పించి అర్చించారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలు కొనసాగాయి.
పీఠాధిపతులకు పూర్ణకుంభ స్వాగతం
మూలామహోత్సవ వేడుకలకు హాజరైన పీఠాధిపతులు విద్యాశంకర భారతీ, మాధవానంద సరస్వతి స్వాములకు ఆలయ అర్చక పరివారం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం విద్యాశంకర భారతీ స్వామి వారు భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు.
మాజీ గవర్నర్ రోశయ్య, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డికి సన్మానం
వర్గల్ ఉత్సవాలకు వేర్వేరుగా హాజరైన మాజీ గవర్నర్ రోశయ్య, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డిని చంద్రశేఖర సిద్ధాంతి అధ్వర్యంలో వేదపండితులు ఘనస్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ వర్గల్ క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ క్షేత్రంగా విరాజిల్లాలని ఆకాంక్షించారు.
భారీగా అక్షర స్వీకారాలు
మూలా మహోత్సవం సందర్భంగా అక్షరస్వీకారానికి పెద్ద సంఖ్యలో చిన్నారులు తరలిరావడంతో అక్షరాభ్యాస ప్రాంగణం కిక్కిరిసిపోయింది. దేవాలయ రజతోత్సవం సందర్భంగా పుష్పగిరి, తొగిట పీఠాధిపతులు విద్యాశంకర భారతీ స్వామి, మాధవానంద సరస్వతిల సమక్షంలో పలువురు ప్రముఖులకు ఆలయ కమిటి ఘన సన్మానంసింది. రాష్ట్రపతి అవార్డు గ్రహీత వెంకట్రామన్ ఘనాపాఠి, దేవాలయ నిర్మాణ స్ఫూర్తి ప్రదాత ఏకే శ్రీనివాసాచార్య సిద్ధాంతి తరఫున వారి కుటుంబ సభ్యులకు ఆలయం తరఫున పురస్కారాలు అందజేసి ఘనంగా సన్మానించారు.
అదేవిధంగా శాస్త్రుల రఘురామశర్మ, మంచినీళ్ల రాఘురామశర్మ, అయాచితం నటేశ్వరశర్మ, మూటకోడూరు బ్రహ్మం, డాక్టర్ రాధశ్రీ, మరుమాముల దత్తాత్రేయశర్మ, జీఎం రామశర్మ, చిల్లర భావనారాయణశర్మ, మరుమాముల వెంకటరమణశర్మకు పురస్కారాలు అందజేసారు. టీడీపీ నేత బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి, టీఆర్ఎస్ నేత మడుపు భూంరెడ్డి, టేకులపల్లి రాంరెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి, జెడ్పీటీసీ పోచయ్య తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.