రోయర్ దత్తుకు రియో బెర్త్
న్యూఢిల్లీ: భారత రోయింగ్ ఆటగాడు దత్తు బబన్ బొకనల్ రియో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించాడు. ఆసియా-ఓసియానియా ఒలింపిక్ క్వాలిఫికేషన్ రెగట్టాలో సోమవారం అతను రజత పతకం గెలుపొందడంతో బెర్త్ ఖాయమైంది. దక్షిణ కొరియాలోని చుంగ్-జూలో జరిగిన ఈ అర్హత పోటీల్లో పురుషుల సింగిల్ స్కల్స్ ఈవెంట్లో బరిలోకి దిగిన భారత రోయర్ రెండో స్థానంలో నిలిచాడు. 2 కిలోమీటర్ల కోర్స్‌ను ఈ 25 ఏళ్ల ఆర్మీ ఆటగాడు 7 నిమిషాల 07.63 సెకన్లలో పోటీని పూర్తి చేసి రజతం గెలుచుకున్నాడు.
ఆరంభం నుంచి జోరుమీదున్న దత్తు ఒక దశలో పసిడి వేటలో ముందంజలో ఉన్నాడు. అయితే చివరి స్ట్రెచ్‌లో వేగం పెంచిన ఆతిథ్య కొరియన్ రోయర్ డాంగ్యాంగ్ కిమ్ (7 ని.05.13 సె) భారత ఆటగాడిని బోల్తాకొట్టించడంతో అతను రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇందులో టాప్-7లో నిలిచిన ఆటగాళ్లంతా రియోకు అర్హత పొందారు. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన దత్తు పుణెలోని ఆర్మీ రోయింగ్ నోడ్ (ఏఆర్ఎన్)లో శిక్షణ పొందాడు. భారత్ తరఫున రోయింగ్‌లో రియోకు పయనమయ్యే ఒకే ఒక్క ఆటగాడు దత్తు బబన్. ఈ ఈవెంట్లో ఒలింపిక్ క్వాలిఫయింగ్ పోటీలు ముగిశాయి.