మీడియాపై చర్యలు తీసుకుంటా: సీఎం
గుజరాత్లో ఎన్‌కౌంటర్‌కు గురై మరణించిన ఇష్రత్ జహాన్‌ను తాను ఎప్పుడూ 'బిహార్ పుత్రిక'గా అభివర్ణించలేదని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఖండించారు. ఆ మాటలను తాను అన్నట్లుగా చెప్పిన మీడియా సంస్థలపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇష్రత్ జహాన్‌ను తాను అలా అన్నట్లు ఒక్క ఆధారమైనా చూపించాలని అన్నారు. 'జనతా కే దర్బార్ మే ముఖ్యమంత్రి' కార్యక్రమం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఇప్పటివరకు ఎప్పుడైనా గతంలో అలా అన్నానేమోనని రికార్డులు, న్యూస్ క్లిప్పింగులను పరిశీలిస్తున్నానని, తగినంత గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
తాను పదాలు వాడేటప్పుడు, వ్యాఖ్యలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటానని, తనను అప్రతిష్ఠపాలు చేసేందుకు తాను అనని మాటలు అన్నట్లుగా చెబితే మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. గతంలో సీఎం నితీష్ కుమార్.. ఇష్రత్ జహాన్‌ను బిహార్ పుత్రిక అంటూ చెప్పినట్లు వచ్చిన పత్రికా కథనాలను బీజేపీ నేతలు వెలికి తీశారు. పాక్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ ఆమెను ఉగ్రవాదిగా చెప్పడంతో నితీష్ పాత వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీనిపైనే ఇప్పుడు నితీష్ మండిపడుతున్నారు.