మార్పునకు ఇదే తరుణం
► కార్పొరేషన్ స్కూల్లో ఐఏఎస్ అధికారిణి కుమార్తె
► సమాజంలో మార్పుపై ఆకాంక్ష
► అధికారులకు ఆదర్శం
► కార్పొరేషన్ స్కూల్ ఐఏఎస్ కూతురు
► ఆదర్శంగా నిలిచిన అధికారిణి
నేను సమాజంలో మార్పును ఆశిస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలల్లో చక్కగా బోధించే ఉపాధ్యాయులున్నారు. కార్పొరేషన్ స్కూల్లో చదివి నా కూతురు కచ్చితంగా ఉన్నత విద్యావంతురాలు అవుతుంది. ఆ నమ్మకం నాకుంది. కార్పొరేషన్ స్కూళ్ల స్థాయి పెరగాలనేదే నా ఆశయం . ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్పే ఉపాధ్యాయులు తమ పిల్లలను కార్పొరేట్ పాఠశాల్లో చేర్చుతున్నారు. రోజు కూలిపై జీవించే వారు సైతం తమ బిడ్డలకు మంచి చదువు రావాలని ప్రయివేటు బాటపడుతున్నారు. ఈ పరిస్థితిపై ఎందరో మేధావులు ఆవేదన చెంది.. ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఉపాధ్యాయులు తమ పిల్లల్ని సర్కారు బడుల్లో చేర్చితే మార్పు వస్తుందంటున్నారు. ప్రభుత్వం విద్యకోసం వెచ్చిస్తున్న కోట్లాది రూపాయలు సద్వినియోగమవుతాయని చెబుతున్నారు. ‘ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు చేర్పించకూడదు’ అని ఇటీవల ఒక కేసు విచారణ సందర్భంగా మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి కృపాకరన్ ప్రశ్నించారు. ఆయన మాటలను స్ఫూర్తిగా తీసుకున్నారు చెన్నైలోని ఐఏఎస్ అధికారిణి ఆర్.లతిత. తన కుమార్తెను కార్పొరేషన్ పాఠశాలలో చేర్చి ఆదర్శంగా నిలిచారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: తల్లిదండ్రులు తమ కడుపు మాడ్చుకునైనా పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో చేరుస్తున్న ఈ రోజుల్లో ఒక మహిళా ఐఏఎస్ అధికారిణి తన కుమార్తెకు కార్పొరేషన్ స్కూల్లో ఓనమాలు దిద్దిస్తున్నారు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్లో రెవెన్యూ, ఆర్థికశాఖ సహాయ కమిషనర్ ఆర్.లలిత తన రెండున్నరేళ్ల కుమార్తె తరుణికను సోమవారం చెన్నై కోడంబాక్కం పులియూర్ కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాలలో ఎల్కేజీలో చేర్పించడం ద్వారా ఆదర్శనీయురాలిగా నిలిచారు.
‘ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు చేర్పించకూడదు’ అని ఇటీవల ఒక కేసు విచారణ సందర్భంగా మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఎన్.కృపాకరన్ ప్రశ్నించారు. న్యాయమూర్తి మాటల్లోని వాస్తవాన్ని గ్రహించి ‘నిజమేకదా’ అని అనుకున్నారు.
ఐఏఎస్, ఐపీఎస్ తదితర ఉన్నతాధికారులు సహజంగా తమ పిల్లలను ప్రయివేటు, కార్పొరేషన్ విద్యాసంస్థల్లో చేర్పిస్తారు. పెద్ద స్కూళ్లలో చదివి తమ పిల్లలు ఐఏఎస్, ఇంజినీరు, డాక్టరుగా చేయాలని ఆశిస్తారు. అయితే ఒక ఐఏఎస్ అధికారిణిగా ఉండి కార్పొరేషన్ స్కూల్లో చేర్పించాలని ఎందుకు అనిపించిందో ఆమె మాటల్లోనే.. ‘‘సమాజంలో ఏదైనా మార్పును ఆశిస్తున్నారా.. అయితే ఆ మార్పును మీతోనే ప్రారంభించండి.. అనే సూక్తి ఉంది. నేను కూడా సమాజంలో ఒక మార్పును ఆశిస్తున్నాను.
ఆ మార్పుకోసం నా కూతురిని కార్పొరేషన్ స్కూల్లో చేర్పించాను. చెన్నై కార్పొరేషన్ స్కూళ్లు ప్రస్తుతం మంచి దశలో ఉన్నాయి. చక్కగా బోధించే ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రయివేటు పాఠశాలలకు దీటుగా కార్పొరేషన్ స్కూళ్లు పనిచేస్తున్నాయి. కార్పొరేషన్ స్కూల్లో చేరిన నా కూతురు కచ్చితంగా ఉన్నత విద్యావంతురాలు అవుతుంది. ఆ నమ్మకం నాకుంది. నన్ను ఎవరైనా ఆదర్శంగా తీసుకుంటే వారి పిల్లలను కూడా ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించాలని కోరుతున్నాను.
కార్పొరేషన్ స్కూళ్ల స్థాయి పెరగాలనేదే నా ఆశయం. చెన్నై కార్పొరేషన్ విద్యాశాఖ సహాయ కమిషనర్గా 2013–14లో పనిచేసే సమయంలో నా కడుపులో బిడ్డ పెరుగుతున్నపుడే కార్పొరేషన్ స్కూల్లో చేర్పించాలని నిర్ణయించుకున్నాను. నా భర్త సుమంత్, తల్లిదండ్రులు రాజేంద్రన్, తమిళరసి సైతం నా నిర్ణయాన్ని సమర్థించారు. అన్ని రకాలా ప్రోత్సహించారు.’’ అన్నారు ఆ అధికారిణి. ఇదిలా ఉండగా తన కుమార్తెను కార్పొరేషన్ స్కూల్లో చేర్పించిన లలిత, మాజీ మేయర్ సైదై దొరైస్వామి నడుపుతున్న మనిదనేయ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఐఏఎస్ పరీక్ష రాసి ఉత్తీర్ణురాలు కావడం కొసమెరుపు.