భారత రాయభార కార్యాలయ ఉద్యోగి కుమార్తె మృతి
న్యూఢిల్లీ/ఖాట్మండు: భారీ భూకంపం సృష్టించిన బీభత్సం కారణంగా ఇక్కడి భారత రాయభార కార్యాలయం పూర్తిగా దెబ్బతింది. రాయభార కార్యాలయం ఉద్యోగి కుమార్తె మృతి చెందినట్లు భారత విదేశీవ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ట్విట్టర్లో తెలిపారు. రాయభార కార్యాలయం కాంప్లెక్స్‌లోని వారు నివాసం ఉండే ఇల్లు కూలిపోవడంతో దురదృష్టవశాత్తు మన ఉద్యోగి మదన్ కుమార్తె మృతి చెందారని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన అతని భార్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా, నేపాల్‌కు భారత్ అపన్న హస్తం అందిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. అయిదు రెస్క్యూ బృందాలను ఖాట్మండు పంపినట్లు పేర్కొంది. ఆదివారం ఉదయానికి ఈ బృందాలు ఫోఖారా చేరుకుంటాయని తెలిపింది.
భారీ భూకంపం ధాటికి ఖాట్మండులో వేయి భవనాలు కుప్పకూలిపోయాయి. కూలిపోయినవాటిలో చారిత్రక ప్రాధాన్యత గల భవనాలు కూడా ఉన్నాయి. రోడ్లన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి.