నాన్నకు కూతురే ముద్దు!
ఎవరు కాదన్నా అమ్మాయిలంటేనే నాన్నకు ముద్దు. కొడుకుల కంటే కూతుళ్లనే తండ్రులు గారాబంగా చూసుకుంటారు. కూతురికి చిన్న దెబ్బ తగిలినా నాన్న గుండె విలవిల్లాడిపోతుంది. పిల్లలు ఆడా మగా అన్నదానిపై తండ్రుల ప్రవర్తన, వారి మెదడు స్పందించే తీరు ఆధారపడి ఉంటుందని తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో తేలింది. పిల్లలు ఏడిస్తే.. అది ఆడపిల్లలైతే తండ్రులు వెంటనే లేచి పరిగెడతారని, మగపిల్లలైతే మాత్రం పెద్దగా స్పందించరని.. తల్లులకు వదిలేస్తారని పరిశోధనకు నేతృత్వం వహించిన ఎమొరి యూనివర్సిటీ ఆసిస్టెంట్ ప్రొఫెసర్ జెన్నిఫర్ మస్కారో తెలిపారు. అంతేకాదు, అమ్మాయిలను ఆడించేటప్పుడు తండ్రులు చాలా విశ్లేషణాత్మకంగా ఉంటారని, దానివల్ల భవిష్యత్తులో ఆడ పిల్లలు చదువుల్లో కూడా ముందంజలో ఉంటారని చెప్పారు.
అబ్బాయిలతో మాట్లాడేటప్పుడు తండ్రులు ప్రౌడ్, విన్, టాప్ లాంటి పదాలు ఉపయోగిస్తారని, అదే అమ్మాయిలతో అయితే ఆల్, బిలో, మచ్ లాంటివి ఎక్కువ వాడతారని అన్నారు. దీన్ని బట్టి చూస్తే తండ్రులు కొడుకుల కంటే కూతుళ్లనే ఎక్కువగా ఆదరిస్తారని తేలింది. దాంతో పాటు.. తమ కూతుళ్లు సంతోషంగా ఉన్నప్పుడు వాళ్లను చూస్తే తండ్రుల మెదడు చాలా బాగా స్పందించిందని బ్రెయిన్ స్కాన్ల ఆధారంగా తేలింది. అదే.. కొడుకులున్న తండ్రుల మెదళ్లు మాత్రం అంత ఎక్కువగా స్పందించలేదట.
ప్రపంచంలో ఏ దేశంలోనైనా దాదాపుగా తండ్రులందరి ప్రవర్తన ఇలాగే ఉంటోందని, అవి కావాలని చేసేవి కావని, ఆటోమేటిగ్గా అయిపోతాయని ఎమొరి యూనివర్సిటీ ఆంత్రోపాలజిస్టు జేమ్స్ రిల్లింగ్ తెలిపారు. తండ్రుల ప్రవర్తన మీదే పెద్దయిన తర్వాత పిల్లల ప్రవర్తన కూడా ఎక్కువగా ఆధారపడి ఉంటుందని, దాంతో కూతుళ్లు ఎక్కువగా లాభపడతారని ఆయన వివరించారు. ఇందుకోసం 30 మంది అమ్మాయిల తండ్రులు, 22 మంది అబ్బాయిల తండ్రుల మెదళ్లను పరిశీలించారు.