భర్తను కడతేర్చిన భార్య
చంపి పాతబావిలో పూడ్చివేత
ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
పరారీలో నిందితులు
మామునూరు : కూతురు, అల్లుడి సహకారంతో ఓ మహిళ భర్తను కడతేర్చి, మృతదేహాన్ని పాతబావిలో పూడ్చిపెట్టిన ఘటన హన్మకొండ మండలం రామకిష్టాపురం శివారులో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. మామునూరు సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. మహబూబబాద్ మండలం ఆమనగల్ శివారు ఖస్నా తండాకు చెందిన బానోత్ భిక్షపతి (53) భార్య రాములమ్మ, కూతురు సునితతో కలిసి 15 ఏళ్ల క్రితం రామకిష్టాపురం వచ్చాడు. ఓ రైతు వద్ద 1.20 ఎకరాల భూమి కౌలుకు తీసుకుని మల్లె, గులాబి సాగు చేస్తూ పూలను వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు.
పదేళ్ల క్రితం అమనగల్ శివారు మెుగిలితండాకు చెందిన లావుడ్యా ఓంజీతో కూతురు వివాహం చేశాడు. ఆ తర్వాత బిక్షపతి దంపతుల మధ్య ఆర్థిక కలహాలు ప్రారంభమయ్యాయి. పలుమార్లు పెద్ద మనుషులు పంచాయితీ చేసినా, గొడవలు సద్దుమణగలేదు. కాగా, ఈనెల 18న ఉదయం 10 గంటలకు బిక్షపతి మొబైల్ కొనుగోలు చేస్తానని చెప్పి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని రాములమ్మ 25న మామునూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
హత్య చేసిన తీరు ఇలా..
తన మాటలను బిక్షపతి లెక్కచేయడం లేదని, కూతురు, అల్లుడి సహకారంతో అతడిని మట్టుబెట్టాలని రాములమ్మ పథకం రచించింది. ఈనెల 17న వారిని ఇంటికి పిలిపించింది. 18వ తేదీ తెల్లవారుజామున ఆల్లుడు ఓంజీ, కూతురు సునితతో కలిసి భర్తను హత్య చేసింది. మృతదేహాన్ని గోనెసంచిలో మూటకట్టి సైకిల్‌పై ఆల్లుడితో గ్రామ శివారులో పాడుబడిన బావి వద్దకు పంపించింది. ముగ్గురూ కలిసి గొయ్యితీసి మృతదేహాన్ని పూడ్చేశారు. తెల్లవారిన తర్వాత.. తన భర్త మెుబైల్ కొనుగోలుకు వెళ్లి తిరిగి రాలేదంటూ ఇరుగుపొరుగు వారికి చెప్పింది. ఎవరికీ అనుమానం రాకుండా సాయంత్రం బంధువుల ఇళ్లు, బావులు, ఇతర ప్రాంతాల్లో వెదికారు.
25వ తేదీన రాములమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హత్య తర్వాత అమనగల్ వెళ్లిన కూతురు, అల్లుడు తమ పిల్లలను అక్కడే ఉంచి బుధవారం తిరిగి రామకిష్టాపూర్ వచ్చారు. అయితే సునిత ఆరేళ్ల కుమారుడు రాంచరణ్ హత్య విషయాన్ని బిక్షపతి సమీప బంధువు నూనావత్ లక్ష్మణ్‌కు చెప్పాడు. వెంటనే అతడు రాంచరణ్‌ను తీసుకుని రామకిష్టాపూర్ వచ్చి పాతబావిలో వెదకగా మృతదేహం కనిపించింది. దీంతో మామునూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హన్మకొండ తహసీల్దార్ రాజ్‌కుమార్, ఏసీపీ మహేందర్, సీఐ పి.శ్రీనివాస్, ఎస్సై రాంప్రసాద్ బావివద్దకు చేరుకుని పరిశీలించారు. ఆప్పటికే నిందితులు పరారయ్యారు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. నిందితుల కోసం వెదుకుతున్నామని సీఐ తెలిపారు.