నిషాతో లైఫ్ మారింది
నటిగా సన్నీ లియోన్ గురించి చెప్పాలంటే... తప్పకుండా ‘బీ–టౌన్ ఎంట్రీకి ముందు, ఆ తర్వాత’ అనాలి. హిందీ చిత్రపరిశ్రమలో ప్రవేశించక ముందు సన్నీ నీలి చిత్రాల్లో నటించారు. ఇప్పుడు పూర్తిగా వాటిని వదిలేసి, నటిగా తనని తాను సరికొత్తగా ఆవిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరి, వ్యక్తిగా ఆమె గురించి చెప్పాలంటే... ‘నిషా ఎంట్రీకి ముందు, ఆ తర్వాత’ అనాలంటున్నారు సన్నీ లియోన్.
ఈ నిషా ఎవరనుకుంటున్నారా? డానియేల్ వెబర్–సన్నీ లియోన్ దంపతుల దత్త పుత్రిక. ఇటీవలే సన్నీ దంపతులు నిషాను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. దత్త పుత్రిక గురించి సన్నీ మాట్లాడుతూ –‘‘నిషా వచ్చిన తర్వాత మా జీవితాలు మారాయి. ఇప్పుడు మరింత సంతోషంగా ఉంటున్నాను. నా కూతురికి గోరుముద్దలు తినిపించడం, తనను నిద్రపుచ్చడం భలే సరదాగా ఉంది. నేనూ తనతోనే ఆడుకుంటూ నేలపైనే ఎక్కువ టైమ్ గడుపుతున్నా. ఈ మాతృత్వాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. లైఫ్‌లోకి ఎవర్ని ఎప్పుడు పంపాలో దేవుడికి బాగా తెలుసు’’ అన్నారు.