కామెరూన్ నోట 'అచ్ఛే దిన్' మాట
లండన్: దాదాపు 60 వేల మంది ఎన్నారైలతో కిటకిటలాడిపోతోన్న వెంబ్లే స్టేడియానికి భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఇంగ్లాండ్ ప్రధాని డేవిడ్ కామెరూన్ దంపతులు కలిసి వచ్చారు. నాయకులు ప్రధాన వేదికపైకి చేరుకోగానే నినాదాలు మిన్నంటాయి. మొదటగా కామెరూన్ ప్రసంగించారు. వెంబ్లే స్టేడియంలో మోదీ సభ ఓ చారిత్రక ఘట్టమని, బ్రిటన్.. భారత్ కు ఎల్లవేళలా అండగా ఉంటుందని కామెరూన్ అన్నారు.
'భారత పారిశ్రామిక రంగంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోన్నది బ్రిటన్ కంపెనీలే. ఇక ముందు కూడా ఆ పనిని మరింత ముందుకు తీసుకెళతాం. అందుకుగానూ ప్రధాని నరేంద్ర మోదీ చేస్తోన్న ప్రణాళికలు అద్భుతంగా ఉన్నాయి. మోదీ ఎప్పుడూ చెప్పే 'అచ్ఛే దిన్ (మంచి రోజులు) తప్పక వచ్చినట్లే' అని కామెరూన్ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ కు సభ్యత్వం ఇవ్వాల్సిందేనని ఇంగ్లాండ్ డిమాండ్ చేస్తున్నదని, భారత్ నుంచి చాలా విషయాలు నేర్చుకునే అవకాశం దక్కిందని అన్నారు.