‘రివర్స్’లో చెరొకటి
► రామ్‌కుమార్ గెలుపు... ప్రజ్నేశ్ ఓటమి
► ఉజ్బెకిస్తాన్‌పై భారత్ 4–1తో విజయం
బెంగళూరు: డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 రెండో రౌండ్ మ్యాచ్‌లో భారత టెన్నిస్ జట్టు క్లీన్‌స్వీప్ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. రివర్స్ సింగిల్స్‌లో భారత్, ఉజ్బెకిస్తాన్లు చెరో మ్యాచ్ గెలిచాయి. దీంతో భారత్ 4–1 గెలుపుతో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన తొలి రివర్స్ సింగిల్స్‌లో రామ్‌కుమార్ రామనాథన్ గెలుపొంది భారత్ ఆధిపత్యాన్ని చాటాడు. రామ్‌కుమార్ 6–3, 6–2తో సంజార్ ఫెజీవ్ను కంగుతినిపించాడు.
67 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో ప్రత్యర్థిపై రెండు సెట్లలోనూ రామ్‌కుమారే పైచేయి సాధించాడు. తర్వాత జరిగిన రెండో రివర్స్ సింగిల్స్‌లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 5–7, 3–6తో ఇస్మాయిలోవ్ చేతిలో పరాజయం చవిచూశాడు. ఈ విజయంతో ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్‌కు అర్హత పొందిన భారత్‌కు... సెప్టెంబర్‌లో జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్‌లో అర్జెంటీనా, జర్మనీ, చెక్ రిపబ్లిక్, స్విట్జర్లాండ్, జపాన్, కెనడా, రష్యా, క్రొయేషియా జట్లలో ఒక జట్టు ప్రత్యర్థిగా ఉండనుంది.