దావూద్ ఇబ్రహీం చిరునామా ఇదీ!
⇒ మూడు చిరునామాలను పట్టేసిన భారత నిఘావర్గాలు
⇒ మాజీ క్రికెటర్ మియాందాద్ కొడుకుతో దావూద్ వియ్యం
⇒ దావూద్ ఇబ్రహీంకు ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్లు
⇒ భార్య పేరుతో ఉన్న టెలిఫోన్ బిల్లు కూడా లభ్యం
⇒ సంచలన ఆధారాలు సంపాదించిన భారత నిఘాబృందం
న్యూఢిల్లీ:
భారతదేశంలో పదే పదే ఉగ్రవాద దాడులకు కుట్రలు పన్ని.. పాకిస్థాన్‌లో నక్కి ఉన్న దావూద్ ఇబ్రహీం చిరునామా మొత్తం భారత నిఘా వర్గాలకు తెలిసిపోయింది. తన భార్య మెహజబీన్ షేక్, కొడుకు మొయీన్ నవాజ్, కూతుళ్లు మహరుక్, మెహ్రీన్, మాజియా అందరితో కలిసి దావూద్ పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలోనే ఉంటున్నట్లు తెలిసిపోయింది. అందుకు పక్కా ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. వాటితో పాటు.. దావూద్ తాజా ఫొటోను కూడా భారత నిఘావర్గాలు సంపాదించాయి. కరాచీ శివార్లలోని క్లిఫ్టన్ అనే ప్రాంతంలో దావూద్ ప్రస్తుతం ఉంటున్నాడు. అతడి కొడుకు మొయీన్‌కు సానియా అనే అమ్మాయితో పెళ్లయింది.
కూతుళ్లలో మహరూఖ్కు పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ కొడుకు జునాయిద్తో పెళ్లయింది. 2015 ఏప్రిల్ నెలలో దావూద్ ఇబ్రహీం భార్య మెహజబీన్ పేరు మీద ఉన్న టెలిఫోన్ బిల్లులను కూడా భారత నిఘా వర్గాలు సంపాదించాయి. అందులో దావూద్ చిరునామా ఇలా ఉంది.. ''డి-13, బ్లాక్-4, కరాచీ డెవలప్మెంట్ అథారిటీ, ఎస్‌సిహెచ్-5, క్లిఫ్టన్''. దావూద్ ఇబ్రహీంకు మూడు పాకిస్థానీ పాస్‌పోర్టులు ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో ఈ ఒక్క చిరునామాయే కాకుండా.. మరో రెండు చిరునామాలు కూడా అతడికి ఉన్నాయి. వాటిలో ఒకటి.. ''6ఎ, ఖయబాన్ తంజీమ్, ఫేజ్ 5, డిఫెన్స్ హౌసింగ్ ఏరియా. మరొకటి మొయిన్ ప్యాలెస్, రెండో అంతస్థు, అబ్దుల్లా షా ఘాజీ దర్గా వద్ద, క్లిఫ్టన్, కరాచీ.
1993లో ముంబై మహానగరంలో వరుస పేలుళ్లకు ప్రధాన కుట్రదారు అయిన దావూద్ ఇబ్రహీం పేరు మీద ఇంటర్‌పోల్ ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసు జారీచేసింది. ఆ పేలుళ్లలో 257 మంది మరణించగా వందలాది మంది గాయపడ్డారు. దావూద్ తమ దేశంలో ఉన్న విషయాన్ని పాక్ పదే పదే ఖండిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజా ఆధారాలతో ఇక ఆ దేశం ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది.