పట్టపగలే నాలుగు హత్యలు!!
మహారాష్ట్రలోని థానె జిల్లాలో ఒకేరోజు పట్టపగలు నాలుగు హత్యలు జరిగాయి. హతుల్లో ఇద్దరు గృహిణులు కూడా ఉన్నారు. గంగ్రిపాద ప్రాంతంలో ఐదారుగురు వ్యక్తులు పాతికేళ్ల యువకుడిపై పదునైన ఆయుధాలతో దాడి చేశారు. కరెంటు స్తంభానికి కొట్టేసి మరీ ఈ ఘాతుకానికి పాల్పడటంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. మరో మూడు సంఘటనలు థానె పోలీసు కమిషనరేట్ పరిధిలో జరిగాయి. కాన్ గ్రామంలో 32 ఏళ్ల తరన్నుమ్ అస్లాంఖాన్ అనే మహిళను ఆమె భర్త చంపేసి, గోనెసంచిలో శవాన్ని కట్టేసి, ఓ పైప్‌లైను వద్ద విసిరేశాడు.
బద్లాపూర్ రైల్వేస్టేషన్ వద్ద రాత్రి 10.40 గంటల ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఏజెంటు ఒకరిని కాల్చిచంపారు. సంతోష్ సాల్వి తన స్నేహితుడితో కలిసి మద్యం తాగుతుండగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వెంటనే మహేంద్ర భాగుల్ అనే ఆ స్నేహితుడు కాల్చిచంపాడు. లవ్‌కుశ్ హౌసింగ్ సొసైటీ ప్రాంతంలో నివిసించే పూనమ్ గజ్రానీ అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. గ్యాస్ సిలిండర్‌తో ఆమె తలపై మోది, కత్తులతో పొడిచి, గొంతుకు వైరు బిగించి మరీ చంపారు.