‘స్నేక్‌గ్యాంగ్’ దయానీకి చుక్కెదురు
బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్ : ‘స్నేక్ గ్యాంగ్’లో కీలక వ్యక్తి ఫైజల్ దయానీకి హైకోర్టులో చుక్కెదురైంది. గత ఏడాది జూలైలో ఓ యువతిపై అత్యాచారం చేసిన ఘటనలో అరెస్టయిన తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దయానీ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు బుధవారం కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి ఎం.ఎస్.కె.జైశ్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. దయానీ ఆధ్వరంలోని స్నేక్‌గ్యాంగ్ సభ్యులు తనను కొట్టి, తన స్నేహితురాలిపై అత్యాచారం చేయడమే కాకుండా, ఆ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించి, వాటిని ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తామని బెదిరించారంటూ 2014 జూలై 31న ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనలో దయానీతో పాటు ఇద్దరు కోర్టులో లొంగిపోగా, మరో ముగ్గురిని పోలీసులుఅరెస్ట్ చేశారు. తాజాగా దయానీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌ను తెలంగాణ రాష్ట్ర అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.రామిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. దయానీకి బెయిల్ ఇస్తే దుబాయ్‌కి పారిపోయే అవకాశం ఉందని తెలిపారు. అంతేకాక సాక్షులను బెదిరించి దర్యాప్తునకు విఘాతం కలిగించే అవకాశం ఉందని వివరించారు. పీపీ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి జస్టిస్ జైశ్వాల్ బెయిల్ కోసం దయానీ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కొట్టేశారు.