అక్రమాస్తులపై ఏసీబీ కొరడా..
నల్లగొండలో వాణిజ్యపన్నులశాఖ డీసీ సాయికిషోర్ అరెస్ట్
హైదరాబాద్‌కు తరలింపు
నల్లగొండ క్రైం : పట్టణంలో గురువారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు హల్చల్ సృష్టించారు. లెక్కలేనన్ని అక్రమాస్తులు కూడబెట్టాడనే ఫిర్యాదుపై నల్లగొండ-మహబూబ్‌నగర్ డివిజన్ వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటి కమిషనర్ నల్ల సాయికిషోర్‌ను గురువారం తెల్లవారుజామున పట్టణంలోని మీర్బాగ్ కాలనీలోని అద్దె ఇంట్లో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. సాయికుమార్ అక్రమాస్తుల కేసుపై అన్వేషణలో ఉన్న అధికారులు తెల్లవారుజామున ఒక్కసారిగా సాయికిషోర్ ఉంటున్న ఇంటిపై సోదాలను నిర్వహించారు. పలుడాక్యుమెంట్లను, విలువైన ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.
ముందు కార్యాలయంలో సోదాలు నిర్వహించిన అధికారులు రూ.60వేల నగదుతో పాటు ఇతర విలువైన పత్రాలను చేజిక్కించుకున్నారు. అక్రమాస్తులను లోతుగా తొవ్వి నిగ్గుతేల్చేందుకు ఏసీబీ బృందాలు రంగంలోకి దిగాయి. సాయికిషోర్ సొంత జిల్లా అయిన కృష్ణాజిల్లాలోని తిరుపురంలో కూడా సోదాలు జరిగాయి. హైదరాబాదులోని గచ్చిబౌలి, లోయర్‌ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో రెండు ఇళ్లు, సొంత జిల్లాలో చాపల చెరువులు, బినామీ ఆస్తులు కూడా ఉన్నట్టు గుర్తించారు. గతంలో పనిచేసిన గుంతకల్లు, గుంటూరు, మలక్‌పేటలోని ఆస్తుల వివరాలను తెలుసుకునేందుకు కూపీ లాగుతున్నారు.
బ్యాంకు ఖాతాలు, వాటిలోని బ్యాలెన్స్‌లు తెలుసుకునేందుకు బ్యాంక్ అధికారులను సంప్రదించే పనిలో పడ్డారు. బంధువుల పేరున బ్యాంక్ బినామీ ఆస్తులున్నాయన్న కోణంలో దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ప్రాంతాల వారీగా విడిపోయిన ఏసీబీ అధికారులు ఏకకాలంలో అన్ని ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. రాత్రి వరకు రూ. 3కోట్ల ఆస్తులున్నట్లు తెలుసుకుని దొరికిన ఆధారాల ప్రకారం అరెస్ట్ చేశారు. ప్రస్తుతం హైదరాబాదులోని సాయికిషోర్ నివాసంలో వి చారణ కొనసాగుతుందని ఏసీబీ సీఐ శ్రీనివాస్ తెలిపారు.