DCC President post
-
జంగారెడ్డి నారాజ్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పరిషత్ కాంగ్రెస్ పక్ష నాయకుడు ఏనుగు జంగారెడ్డి పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై నొచ్చుకున్న ఆయన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కందుకూరు జెడ్పీటీసీగా ప్రాతినిథ్యం వహిస్తున్న జంగారెడ్డి 2014లో జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఆశించారు. తగినంత సంఖ్యాబలం వచ్చినప్పటికీ టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో జెడ్పీ పీఠం దక్కలేదు. ఆ తర్వాత జిల్లా కాంగ్రెస్ పార్టీ సారథ్యంపై కన్నేసినా సామాజిక సమీకరణల్లో ఈ పదవి కాస్తా బీసీ వర్గానికి చెందిన క్యామ మల్లేశ్‌కు కట్టబెట్టారు. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో మహేశ్వరం సీటును జంగారెడ్డి ఆశించినప్పటికీ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెర మీదకు రావడంతో మిన్నకుండిపోయారు. అయితే, ఎన్నికల వేళ క్యామ మల్లేశ్ పార్టీ పెద్దలపై ధిక్కార స్వరం వినిపించి టీఆర్ఎస్ గూటికి చేరడంతో డీసీసీ కుర్చీ ఖాళీ అయింది. ఈ పోస్టును దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ మహేశ్వరం నియోజకవర్గానికే చెందిన చల్లా నర్సింహారెడ్డి పేరు దాదాపు ఖరారు కావడంతో జంగారెడ్డి నారాజ్ అయ్యారు. పార్టీ కోసం అహర్నిశలు కృషిచేసినా ఫలితంలేకుండా పోయిందని ఆయన తన సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేగాకుండా చల్లా నర్సింహారెడ్డి పేరును మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సిఫార్సు చేయడంతో కినుక వహించిన ఆయన పార్టీని వీడడమే మేలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. గత రెండు రోజులుగా ఈ వ్యవహారంపై సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతున్న జంగారెడ్డి తనకు గుర్తింపులేని పార్టీలో కొనసాగడం కన్నా ప్రత్యామ్నాయం చూసుకోవడమే మంచిదనే భావనకు వచ్చినట్లు తెలుస్తోంది. కష్టకాలంలో పార్టీకి వెన్నంటి నిలిచినా అన్యాయం జరిగిందని ఆయన అనుయాయులతో వాపోయినట్లు సమాచారం. అయితే, పార్టీని వీడాలని భావిస్తున్న జంగారెడ్డి ఏ పార్టీలో చేరుతారనేదానిపై మాత్రం ఇంకా స్పష్టతనివ్వడంలేదు. -
అతివృష్టి.. అనావృష్టి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 33 జిల్లాలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవులను భర్తీ చేసే విషయంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. కొన్ని జిల్లాల్లో ఈ పదవి కోసం విపరీతమైన పోటీ ఉండగా.. మరికొన్ని చోట్ల ఒక్కరు కూడా ముందుకు రాని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ పదవుల భర్తీ వ్యవహారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) నాయకత్వానికి తలనొప్పిగా మారింది. వాస్తవానికి ఈ నెల 10 లోపే డీసీసీ అధ్యక్షుల నియామకం పూర్తిచేయాలని ఏఐసీసీ ఆదేశించినా, ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో డీసీసీ అధ్యక్షుల జాబి తాను ఎట్టి పరిస్థితుల్లో సోమవారం రాత్రి కల్లా తమకు పంపాలని మరోమారు ఏఐసీసీ నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో టీపీసీసీ నేతలు సోమవారం సుదీర్ఘంగా కసరత్తు చేసినప్పటికీ 12 జిల్లాల్లో ఏకాభిప్రాయం కుదరలేదని తెలి సింది. మరోమారు కసరత్తు చేసి మంగళవారం ఏఐసీసీకి జాబితా పంపిస్తామని, రెండు, మూడు రోజుల్లో జిల్లాలకు పార్టీ అధ్యక్షుల నియామకంపై ఏఐసీసీ నుంచి ప్రకటన వస్తుందని టీపీసీసీ నేత ఒకరు వెల్లడించారు. మాకొద్దు బాబోయ్...! పార్టీ అధికారంలో లేకపోవడంతో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉంటే ఖర్చును భరిం చాల్సి వస్తుందనే కారణంతో చాలా చోట్ల డీసీ సీ అధ్యక్షులుగా ఉండేందుకు కాంగ్రెస్ నేతలెవ రూ ఆసక్తి చూపడంలేదు. పార్టీ గుర్తించి పదవి ఇస్తే అంగీకరించాలో వద్దో అనే మీమాంసలోనూ కొంతమంది ఉన్నారు. సిద్ధిపేట, సిరి సిల్ల, జగిత్యాల వంటి చోట్ల ఈ పదవి కోసం ఒక్కరు కూడా ముందుకు రావడంలేదని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. కొన్నిచోట్ల మాత్రం ఇందుకు పెద్ద ఎత్తున పోటీ కనిపిస్తోంది. ఖమ్మం జిల్లా డీసీసీ కోసం ఏకంగా ఏడుగురు నేతలు పోటీ పడుతుండగా, ఆ పదవి కావాలని అడగకపోయినప్పటికీ మరో నేత పేరును టీపీసీసీ నాయకత్వమే పరిశీలి స్తోంది. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కూడా వివిధ సమీకరణల నేపథ్యంలో ఆరుగురు పేర్లు తెరమీదకు వచ్చాయి. ఆసిఫాబాద్, నల్లగొండ, సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్ష పదవులను ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, చిరుమర్తి లిం గయ్య, జగ్గారెడ్డి, ఆయన భార్య నిర్మలకు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిర్మల్‌లో మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, జగిత్యాలలో ఇటీవల పోటీ చేసి ఓడిపోయిన అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, యాదాద్రి జిల్లాకు భిక్షమయ్యగౌడ్‌ను నియమించనున్నట్టు సమాచారం. కొత్తగూడెం జిల్లాకు సీనియర్ ఎమ్మెల్యే వన మా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్ర పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఇక్కడ మరో ఇద్దరు నేతలు కూడా పోటీలో ఉన్నారు. అయితే అతివృష్టి, లేకుంటే అనావృష్టి అన్న తరహాలో ఈ వ్యవహారం ఉండటంతో డీసీసీ అధ్యక్ష పదవుల భర్తీ ఎలా చేయాలో తెలియక టీపీసీసీ నాయకత్వం మల్లగుల్లాలు పడుతోం దని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. -
చేతికి సారథి ఎవరో?
త్వరలో ఏఐసీసీ కొత్త జిల్లాలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమించనుంది. ఇందుకు పార్టీ అధినేత రాహుల్ గాంధీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. కొత్త జిల్లాలకు సైతం ఇప్పటికీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పునర్విభజనలో భాగంగా వికారాబాద్ జిల్లా 2016 అక్టోబరు 11న ఏర్పడింది. అప్పట్లో కొత్త జిల్లాలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమిస్తారని ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. అయితే, త్వరలో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో డీసీసీ అధ్యక్షుల నియామకంపై అధిష్టానం దృష్టిసారించినట్లు తెలుస్తోంది. జిల్లా డీసీసీ పీఠాన్ని దక్కించుకునేందుకు పలువురు నేతలు తమదైన శైలిలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సాక్షి, వికారాబాద్: కొత్త జిల్లాలకు డీసీసీ ఉంటే పార్టీ మరింత బలోపేతమై కార్యకర్తల్లో నూతనోత్తేజం రానుందని కాంగ్రెస్ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఈవిషయంలో దృష్టిసారించాలని పలుమార్లు టీపీసీసీ జాతీయ నాయకత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇది కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఏ కారణం చేతనో ఆగిపోయింది. దీంతో పార్టీ వ్యవహారాలను ఉమ్మడి జిల్లాల అధ్యక్షులే పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ వికారాబాద్ జిల్లాలో పర్యటించడం లేదని, పార్టీ బలోపేతానికి కార్యక్రమాలు నిర్వహించడం లేదని కాంగ్రెస్ నాయకులు బాహాటంగానే విమ ర్శిస్తున్నారు. కొత్తగా డీసీసీని నియమిస్తే పార్టీ క్షేత్రస్థాయిలో బలపడుతుందని జిల్లాకు చెందిన నేతలు అభిప్రాయపడుతున్నారు. తమ ప్రయత్నాల్లో ఆశావహులు డీసీసీ (జిల్లా కాంగ్రెస్ కమిటీ)సారథ్య బాధ్యతలనునిర్వర్తించేందుకు పలువురు నేతలు ఉత్సాహం చూపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌ను నియమిస్తున్నట్లు ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో మళ్లీ ఉమ్మడి రంగారెడ్డి అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌నే కొనసాగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అయితే, ప్రస్తుతం కొత్త జిల్లాలకు అధ్యక్షులను నియమించాలనే టీపీసీసీ ప్రతిపాదనలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పచ్చజెండా ఊపడంతో ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. డీసీసీ అధ్యక్ష పీఠాన్ని ఆశిస్తున్న మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ మూడు రోజుల క్రితం ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాంరమేష్‌ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. డీసీసీ విషయంలోనే ఆయన తనను కలిసినట్లు జిల్లాలో ప్రచారం కూడా జరుగుతోంది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ పోస్టుకు ప్రాధాన్యం పెరిగిందని చెప్పవచ్చు. టికెట్ల కేటాయింపులో పార్టీ జిల్లా అధ్యక్షుల అభిప్రాయాలు తీసుకోవడం, బీ ఫారాల పంపిణీ బాధ్యత వారిదే కావడం, ఎన్నికల ప్రచారంలో కీలకపాత్ర పోషించే అవకాశం ఉండడంతో ఎలాగైనా డీసీసీ పదవిని దక్కించుకోవాలని ఆశావహులు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌తో పాటుగా మరో మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్, పరిగి ఎమ్మెల్యే టి.రాంమోహన్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి తదితరులు పోటీలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, అధిష్టానం ఎవరిపైన కరుణ చూపిస్తుందోనని కార్యకర్తలు, నాయకులు ఎదురుచూస్తున్నారు. విభేదాలు అంతరిస్తాయా..? జిల్లా ఏర్పడి రెండేళ్లు కావొస్తుండడంతో కాంగ్రెస్‌కు జవసత్త్వాలు రావాలంటే ప్రత్యేక కార్యవర్గం ఉండాల్సిందేనని పార్టీ నాయకులు, కార్యకర్తలు పేర్కొంటున్నారు. పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేశ్ జిల్లా ఏర్పడిన రెండేళ్లలో ఎప్పుడూ జిల్లాలో ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు లేవు. దీంతోపాటు ఆయన కొంతమంది నాయకులకే వత్తాసు పలుకుతూ మరికొందరిని నిర్లక్ష్యం చేస్తున్నారనే అపవాదు ఉంది. దీంతోపాటు ఉమ్మడి జిల్లాలోని కొందరు నేతలు వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకుల్లో చిచ్చుపెడుతూ విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈనేపథ్యంలో కొత్త జిల్లాలకు అధ్యక్షులను నియమించాలనే అధిష్టానం నిర్ణయం పార్టీకి మేలు చేస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. బరిలో ఆశావహులు డీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి దక్కుతాయోననే విషయంలో పలువురు నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈనెల 13, 14 తేదీల్లో రంగారెడ్డి జిల్లాలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటన ఉందని, దానిని సక్సెస్ చేసే పనిలో ఉన్నామని పరిగి ఎమ్మెల్యే టి.రాంమోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కార్యక్రమం అనంతరం ఈ విషయమై పార్టీ నాయకులమంతా కూర్చొని నిర్ణయిస్తామని అన్నారు. ‘డీసీసీ’ విషయమై ఇంకా చర్చ జరగలేదని, త్వరలో తేలిపోతుందని చెప్పారు. ఇదే విషయమై మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ.. అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తానని పేర్కొన్నారు. డీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారుగా అని అడుగగా.. తప్పకుండా ఉంటాను. అధిష్టానం తనను నియమిస్తే క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతానికి కృషిచేస్తానని పేర్కొన్నారు. దీంతోపాటు డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి సైతం బరిలో ఉన్నారు. తను కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొత్త జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించాలనే పార్టీ నిర్ణయాన్ని అందరు నేతలు స్వాగతించారు. స్థల కేటాయింపునకు.. గుర్తింపు పొందిన పార్టీలకు ప్రభుత్వం నామమాత్రపు ధరకే పార్టీ ఆఫీసుల నిర్మాణాలకు జిల్లా కేంద్రాల్లో భవనాలు నిర్మించుకునేందుకు స్థలాలను కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, ఆయా జిల్లాలకు పార్టీ అధ్యక్షులు, కార్యవర్గాలు నిబంధనల ప్రకారం (బైలాస్) ఉంటేనే దరఖాస్తు చేసుకునే వీలుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులే కొత్త జిల్లాలకు సారథులుగా కొనసాగుతున్నారు. సర్కారు నుంచి స్థలం తీసుకోవాలంటే జిల్లాకు ప్రత్యేకంగా డీసీసీ ఉండాల్సిందేననే అభిప్రాయం వినిపిస్తోంది. -
టీపీసీసీకి 50 మందికి పైగా...
ప్రతి జిల్లాకు డీసీసీ అధ్యక్షుడిని నియమించాలని సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయంతో ఆశావహుల్లో నూతనోత్సాహం నెలకొంది. అదే స్థాయిలో తీవ్ర పోటీ మొదలైంది. టీపీసీసీకి 50 మందికి పైనే దరఖాస్తు చేసుకోగా.. వారిలో కొందరు తమకున్న పరిచయాల ద్వారా పదవికోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సీనియర్లతో పాటు ద్వితీయ శ్రేణి నేతలు సైతం పదవిని దక్కించునేందుకు పావులు కదుపుతున్నారు. సాక్షి, యాదాద్రి (నల్గొండ) : ఆరు నెలల క్రితం ఉమ్మడి జిల్లాలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమించినప్పుడు కొందరు నేతల్లో తెలియని అసంతృప్తి. కొత్త జిల్లాల వారీగా అధ్యక్షులను నియమిస్తారని, ఎలాగైనా పదవి దక్కించుకోవాలనుకుని ఆశపడ్డ ఆశావహులు.. నాడు హైకమాండ్ తీసుకున్న నిర్ణయంతో ఒకింత నిరుత్సాహానికి లోనయ్యారు. తాజాగా అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో వారిలో మళ్లీ ఉత్సాహం ఉరకలేస్తోంది. మరో తొమ్మిది, పది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పార్టీలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా క్షేత్ర స్థాయిలో పార్టీని బలో పేతం చేసి వచ్చే ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవాలన్నది ఆయన లక్ష్యం. అందుకోసం రాష్ట్రం లోని ప్రతి జిల్లాకు ఒక అధ్యక్షుడిని నియమించా లని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నిర్ణయించడంతో ఆశావహులు అధ్యక్ష పదవికోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆయన వద్దనుకుంటే పోటీ తీవ్రమే.. జిల్లా కాంగ్రెస్‌లో వర్గపోరు నడుస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి,ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గ్రూపులుగా కాంగ్రెస్ పార్టీ చీలిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉమ్మ డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న బూడిద భిక్షమయ్యగౌడ్ యాదాద్రి భువనగిరి జిల్లా వాసి. ఆయన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వర్గంలో ఉన్నాడు. అయనను ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి అధిష్టానం నియమించింది. తాజాగా నూతన అధ్యక్షుల నియామ కం జరిగితే ఆయన యాదాద్రిభువనగిరి జిల్లా అధ్యక్ష పదవి తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన డీసీసీ పదవి వద్దనుకుంటే ఆ పదవికి పోటీ తీవ్రం కానుంది. పెద్ద ఎత్తున దరఖాస్తులు : జిల్లాలో భువనగిరి, ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తి స్థా యిలో ఉండగా మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం ఉంది. జిల్లా అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే 50 మందికిపైగా టీపీసీసీకి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఆయా నియోజకవర్గాల్లోని పార్టీకి చెందిన సీనియర్ నేతలు మాకే అవకాశం కల్పించాలని, తమ సామాజిక వర్గాలను సైతం దరఖాస్తుల్లో ప్రస్పుటించారు. దీం తో పాటు పార్టీకోసం చేపట్టిన కార్యక్రమాలు, ప్ర జాప్రతినిధులుగా అందించిన సేవలతో కూడిన సంపూర్ణ సమాచారాన్ని పార్టీ సమర్పిస్తున్నారు. గాడ్ఫాదర్ల ద్వారా ప్రయత్నాలు ఇదిలా ఉండగా జిల్లా అధ్యక్ష పదవికోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, వి.హన్మంతరావు, కొప్పుల రాజు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ద్వారా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా నెల 13, 14తేదీల్లో రాహుల్‌గాంధీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆ తర్వాతే కొత్త జిల్లాలకు అధ్యక్షుల నియామకం ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా జిల్లా అధ్యక్షులుగా ఉన్నవారు ఎమ్మెల్యేలుగా పోటీ చేయకూడదని అప్పట్లో ప్రకటించిన ఏఐసీసీ.. తన నిర్ణయాన్ని విరమించుకుంది. దీంతో పార్టీలో ఇప్పటికే వివిధ పదవులు అనుభవించిన వారు, ద్వితీయశ్రేణి నాయకత్వంతో పాటు ఎమ్మెల్యే, ఎంపీలుగా పోటీ చేయాలనుకునే వారు సైతం అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. అనుభవం కల్గిన నేతలతో పాటు ఈసారి యువనాయకత్వం పదవిని ఆశిస్తోంది. వీరందరూ ఎవరికి వారే తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. -
త్వరలో డీసీసీల ప్రకటన
సాక్షి, వరంగల్ రూరల్: రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో అన్ని జిల్లాలకు జిల్లా కాంగ్రెస్ కమిటీలను ప్రకటించాలని ఏఐసీసీ నిర్ణయించింది. 2016, అక్టోబర్ 11న రాష్ట్రాన్ని 31 జిల్లాలుగా విభజించిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మినహా అన్ని పార్టీలు కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు కమిటీలను ప్రకటించాయి. కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు అనుగుణంగా ఇప్పటికే వైఎస్సార్ సీపీ, బీజేపీ, టీడీపీ జిల్లా అధ్యక్షులను ప్రకటించగా, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీలు ప్రధాన కార్యదర్శులను నియమించాయి. ఇటీవల టీపీïసీసీ సైతం కొత్త జిల్లాల వారీగా డీసీసీలను ఏర్పాటు చేయాలని ఏఐసీసీకి ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లట్ అదేశాలు జారీ చేశారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు కొత్తగా డీసీసీ అధ్యక్షులను నియమించనున్నారు. నూతన జిల్లాలు ఏర్పాటైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా కమిటీలతోనే రాజకీయాలు నిర్వహించింది. రాష్ట్రంలో 31 జిల్లాలకు విడివిడిగా కమిటీలను నియమిస్తే పార్టీ నేతలు, కార్యకర్తల్లో మరింత ఉత్సాహం పెరిగి పార్టీని క్షేత్రస్థాయిలో తీసుకవెళ్లే అవకాశం కలుగుతుందని అధిష్టానం భావించినట్లు తెలిసింది. గత ఏడాదే జిల్లాల వారీగా నూతన కమిటీలు ప్రకటించాలని ఏఐసీసీకి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిపాదనలు పంపారు. కానీ అప్పుడు పాత జిల్లాల వారిగానే నూతన కమిటీలను ప్రకటించారు. పదవుల కోసం ప్రదక్షిణలు డీసీసీ అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు పీసీసీ నేతల చుట్టూ, జిల్లాకు చెందిన సీనియర్ నాయకుల చుట్టూ ఆశావహులు తిరుగుతున్నారు. జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు సైతం తమ అనుచరులకు డీసీసీ అధ్యక్ష పదవులు ఇప్పించుకోవాలని పావులు కదుపుతున్నట్లు సమాచారం. రాహుల్‌గాంధీ హైదరాబాద్ పర్యటన తర్వాత డీసీసీ అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికలే లక్ష్యం.. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలపైనే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా దృష్టి సారించింది. పార్టీ కార్యక్రమాలను ఉధృతం చేసి ప్రజలకు మరింత చేరువ కావడమే లక్ష్యంగా నాయకుల సంఖ్యను పెంచుతున్నారు. రాష్ట్రానికి ఇప్పటికే ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులకు పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఇటీవల వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల నాయకులతో సమావేశాలు కూడా నిర్వహించారు. టికెట్లు ఆశిస్తున్న వారితో ప్రత్యేకంగా మాట్లాడారు. జయశంకర్ భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ మాజీ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఏఐసీసీ మహిళ ప్రధాన కార్యదర్శి సీతక్క, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య కీలకంగా ఉన్నారు. వీరంతా తమ వర్గానికి చెందిన వారికి డీసీసీ అధ్యక్ష పదవి ఇప్పించేందుకు పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో డీసీసీకి ఐదుగురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. పీసీసీ సభ్యుడిగా పనిచేస్తున్న సల్లూరి సమ్మయ్య, గండ్ర జ్యోతి, కాటారం నుంచి మంత్రి మల్లయ్య, గణపురం నుంచి పొలుసాని లక్ష్మీనరసింగారావు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మహబూబాబాద్.. కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత 2016, అక్టోబర్ 20న మహబూబాబాద్ జిల్లాలో రైతు గర్జన కార్యక్రమానికి ముందు మహబూబాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డిని టీపీసీసీ ప్రకటించినప్పటికీ ఏఐసీసీ నుంచి అనుమతి రాలేదు. డీసీసీ అధ్యక్షుడిగా భరత్‌చందర్‌రెడ్డిని ప్రకటిస్తేనే రైతుగర్జన సభ విజయవంతం చేస్తామని ఆయన అనుచరులు ఆందోళన చేశారని తెలిసింది. ఆయన ప్రస్తుతం పీసీసీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. రెండుమార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యరు. భరత్చందర్ రెడ్డి తండ్రి జెన్నారెడ్డి జనార్దన్ రెడ్డి ఐదుసార్లు మానుకోట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం మహబూబాబాద్ నియోజకవర్గ ఇన్చార్జిగా భరత్ చందర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. త్వరలో ప్రకటించే డీసీసీ అధ్యక్ష పదవి భరత్చందర్ రెడ్డికే దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది. జనగామ.. జనగామ జిల్లా నుంచి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి పార్టీలో సీనియర్లుగా ఉన్నారు. జనగామ డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఐదుగురు పోటీ పడుతున్నట్లు తెలిసింది. జనగామ నియోజకవర్గ ఇన్చార్జి చెంచారపు శ్రీనివాస్ రెడ్డి, మునిసిపల్ మాజీ చైర్మన్లు వేమళ్ల సత్యనారాయణరెడ్డి, ఎర్రమల్ల సుధాకర్, స్టేషన్ ఘన్పూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బేతి జయపాల్ రెడ్డి, పీసీసీ సభ్యుడు కోతి ఉప్పలయ్య బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆశీస్సులు ఎవరికి ఉంటే వారికే పదవి దక్కనున్నట్లు సమాచారం. వరంగల్ రూరల్.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వరంగల్ రూరల్ జిల్లాకు చెందినవారే. ఏఐసీసీ సభ్యుడిగా సైతం మాధవరెడ్డి కొనసాగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, ఏఐసీసీ ఓబీసీ సెల్ కార్యదర్శి కత్తి వెంకటస్వామి, బక్క జడ్సన్ సీనియర్లుగా కొనసాగుతున్నారు. డీసీసీ అధ్యక్షుడి రేసులో పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఇనుగాల వెంకట్రాంరెడ్డి ఉన్నట్లు ప్రధానంగా వినిపిస్తోంది. మాధవరెడ్డి ఎవరి పేరును సూచిస్తే వారి పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వరంగల్ అర్బన్.. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న నాయిని రాజేందర్‌రెడ్డి వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో తిరిగి అర్బన్ అధ్యక్షుడిగా తననే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, వరదరాజేశ్వర్‌రావు దంపతులతోపాటు పార్టీలో కొత్తగా చేరిన వేం నరేందర్ రెడ్డి కూడా ఈ పదవిపై కన్నేసినట్లు సమాచారం. -
పీఠమెక్కేదెవరో?
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందోననేది ఉత్కంఠ రేపుతోంది. అధ్యక్షుడి ఎంపిక ఓ పట్టాన తేలకపోవడం.. ఒకరి పేరు ప్రస్తావిస్తే.. మరొకరు వ్యతిరేకించడం.. ఇంకొకరు ససేమిరా అనడం.. ఇక ఈ వ్యవహారాన్ని పరిష్కరించాలని రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు అధిష్టానాన్ని కోరడంతో చివరకు ఢిల్లీకి చేరింది. వర్గ రాజకీయాలకు ఆలవాలం గా ఉన్న జిల్లా కాంగ్రెస్‌లో అధ్యక్షుడిని ఎంపిక చేయ డం ఆది నుంచి అధిష్టానానికి తలకు మించిన భారమే అయింది. గతంలోనూ డీసీసీ అధ్యక్షుడిని నియమించడానికి అధిష్టానం పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సి రావడంతోపాటు పార్టీలోని వర్గ నేతలను ఒప్పించడానికి కష్టపడాల్సి వచ్చింది. దివంగత నేత అయితం సత్యం మరణించడంతో ఖాళీ అయిన ఈ పదవి ఎంపిక వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ని ఏకతాటిపై నడిపించే నేత కోసం పార్టీ అధిష్టానం అనేక నెలలుగా అన్వేషిస్తోంది. అధిష్టానం దృష్టిలో క్లీన్చిట్ ఇమేజ్ ఉన్న పలువురు నేతలున్నా.. వారిని సైతం జిల్లాకు చెందిన కాంగ్రెస్ వర్గ నేతలు ససేమిరా అనడంతో అధ్యక్ష పదవి ఎంపిక వ్యవహారం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. గత నెలలో జిల్లాలో పర్యటించిన ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్ పార్టీకి చెందిన నాయకులతో భేటీ అయినప్పుడు డీసీసీ అధ్యక్ష పదవిని సత్వరం భర్తీ చేయాలన్న డిమాండ్ ముందుకొచ్చింది. అయితే ఈ పదవి కోసం ఎవరికి వారే ప్రయత్నించడంతో అధ్యక్ష పదవి ఆశించే వారి సంఖ్య చాంతాడులా మారింది. జిల్లాలో ప్రధానంగా రేణుకాచౌదరి, భట్టి విక్రమార్క, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సంభాని చంద్రశేఖర్ వర్గాల మధ్య ఏకాభిప్రా యం రాకపోవడంతో ఎవరిని నియమించాలనే అంశం పై మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. డీసీసీ అధ్యక్షుడిగా ఒక దశలో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌కు అవకాశం ఇస్తారని, దీనిపై రాష్ట్ర పార్టీ నేతలతోపాటు జిల్లాకు చెందిన ముఖ్యులూ సానుకూలంగా ఉన్నారనే ప్రచారం జరిగింది. దీంతో ఆయనకే పదవి లభిస్తుందని శ్రేణులు భావించాయి. కాగా, జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత ఈ ప్రతిపాదనను వ్యతిరేకించడం, అందరికీ ఆమోదమైన వారిని నియమించాలని కోరడంతో ఇది రెండునెలలుగా వాయిదా పడుతోంది. అధిష్టానానికి సలీం నివేదిక.. జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్ పార్టీ పరిస్థితులు, వర్గపోరు, అధ్యక్షుడి ఎంపిక వ్యవహారంపై అధిష్టానానికి నివేదిక సమర్పించినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా కొత్త జిల్లాలకు సైతం కాంగ్రెస్ అధ్యక్షులను నియమించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించడంతో కొత్తగూడెం జిల్లాలోనూ ఈ పదవిని ఆశించే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న వారిలో రేణుక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, జిల్లా నాయకులు దిరిశాల భద్రయ్య, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మానుకొండ రాధాకిషోర్, మేళం శ్రీనివాసయాదవ్, నాగండ్ల దీపక్‌చౌదరి, నాగు బండి రాంబాబు రంగంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక బీసీలకు ఈ పదవిని కేటాయించాలని కోరుతున్న కొత్తా సీతారాములు, వడ్డెబోయిన నరసింహారావు, కట్ల రంగారావు తదితరులు ఈ పదవి కోసం పోటీ పడుతుండగా.. ఎస్టీల నుంచి వైరాకు చెందిన రాములు నాయక్, ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన రాందాస్‌నాయక్ తదితరులు రంగంలో ఉన్నట్లు ప్రచారం జరగుతోంది. ఎస్సీల నుంచి సంభాని చంద్రశేఖర్ పేరు ప్రచారంలో ఉంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సైతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి హోరాహోరీగా ప్రయత్నాలు జరుగుతున్నా యి. రేణుకా చౌదరికి సన్నిహితుడిగా పేరున్న ఎడవల్లి కృష్ణ, మాజీ ఎమ్మెల్యే, పినపాకకు చెందిన రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కుమా రుడు రాఘవ ఈ పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై సీరియస్‌గా దృష్టి సారించిన అధిష్టానం వారం పది రోజుల్లో ముఖ్య నేతలతో సంప్రదించి ఒక పేరు ఖరారు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి నే తలు అంగీకరించకుంటే అధిష్టానమే నిర్ణయం తీసుకు ని ఈ నెలాఖరులోగా అధ్యక్షుడి పేరు ఖరారు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. -
డీసీసీ అధ్యక్ష పదవికి దొమ్మేటి రాజీనామా
కాకినాడ, న్యూస్‌లైన్:మూలిగే నక్కపై తాటిపండు చందంగా తయారైంది జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.. అసలే ‘విభజన’ శాపంతో సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్లు దక్కక కుదేలైన కాంగ్రెస్ పార్టీలో ఊహించని రీతిలో భారీ కుదుపు చోటు చేసుకుంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా దొమ్మేటి వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను శనివారం పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డికి పంపించారు. వ్యక్తిగత కారణాల వల్ల పదవి నుంచి తప్పుకుంటున్నట్టు దొమ్మేటి తన లేఖలో పేర్కొన్నారు. 2004లో తాళ్లరేవు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున దొమ్మేటి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 2009లో టికెట్ ఆశించి భంగపడ్డాడు. 2012లో అప్పటి డీసీసీ అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయన స్థానంలో దొమ్మేటిని నియమించారు. కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజుకు అనుచరునిగా కొనసాగుతున్న దొమ్మేటి ప్రస్తుతం పళ్లంరాజు ఒత్తిడి మేరకే రాజీనామా చేసినట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దొమ్మేటి స్థానంలో డీసీసీ అధ్యక్షునిగా ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌ను నియమించే అవకాశాలున్నట్టు చెబుతున్నారు. పదవికి రాజీనామా చేసిన దొమ్మేటి ప్రస్తుతానికి పార్టీలోనే కొనసాగుతున్నట్టుగా చెబుతున్నారు. అయితే కాంగ్రెస్‌లో కొనసాగడం వల్ల రాజకీయ ఎదుగుదల ఉండదన్న భావనతో పార్టీనీ వీడే అవకాశాలున్నాయని అంటున్నారు. త్వరలోనే అధికార తెలుగుదేశం పార్టీలో చేరనున్నారనే వార్తలు విన్పిస్తున్నాయి. జాతీయ పార్టీ అయిన బీజేపీలో చేరితే మేలని ఆయన అనుచరులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు చెబుతున్నారు.