ప్రతి జిల్లాకు డీసీసీ అధ్యక్షుడిని నియమించాలని సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయంతో ఆశావహుల్లో నూతనోత్సాహం నెలకొంది. అదే స్థాయిలో తీవ్ర పోటీ మొదలైంది. టీపీసీసీకి 50 మందికి పైనే దరఖాస్తు చేసుకోగా.. వారిలో కొందరు తమకున్న పరిచయాల ద్వారా పదవికోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సీనియర్లతో పాటు ద్వితీయ శ్రేణి నేతలు సైతం పదవిని దక్కించునేందుకు పావులు కదుపుతున్నారు.
సాక్షి, యాదాద్రి (నల్గొండ) : ఆరు నెలల క్రితం ఉమ్మడి జిల్లాలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమించినప్పుడు కొందరు నేతల్లో తెలియని అసంతృప్తి. కొత్త జిల్లాల వారీగా అధ్యక్షులను నియమిస్తారని, ఎలాగైనా పదవి దక్కించుకోవాలనుకుని ఆశపడ్డ ఆశావహులు.. నాడు హైకమాండ్ తీసుకున్న నిర్ణయంతో ఒకింత నిరుత్సాహానికి లోనయ్యారు. తాజాగా అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో వారిలో మళ్లీ ఉత్సాహం ఉరకలేస్తోంది. మరో తొమ్మిది, పది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పార్టీలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా క్షేత్ర స్థాయిలో పార్టీని బలో పేతం చేసి వచ్చే ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవాలన్నది ఆయన లక్ష్యం. అందుకోసం రాష్ట్రం లోని ప్రతి జిల్లాకు ఒక అధ్యక్షుడిని నియమించా లని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నిర్ణయించడంతో ఆశావహులు అధ్యక్ష పదవికోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఆయన వద్దనుకుంటే పోటీ తీవ్రమే..
జిల్లా కాంగ్రెస్‌లో వర్గపోరు నడుస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి,ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గ్రూపులుగా కాంగ్రెస్ పార్టీ చీలిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉమ్మ డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న బూడిద భిక్షమయ్యగౌడ్ యాదాద్రి భువనగిరి జిల్లా వాసి. ఆయన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వర్గంలో ఉన్నాడు. అయనను ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి అధిష్టానం నియమించింది. తాజాగా నూతన అధ్యక్షుల నియామ కం జరిగితే ఆయన యాదాద్రిభువనగిరి జిల్లా అధ్యక్ష పదవి తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన డీసీసీ పదవి వద్దనుకుంటే ఆ పదవికి పోటీ తీవ్రం కానుంది.
పెద్ద ఎత్తున దరఖాస్తులు :
జిల్లాలో భువనగిరి, ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తి స్థా యిలో ఉండగా మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం ఉంది. జిల్లా అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే 50 మందికిపైగా టీపీసీసీకి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఆయా నియోజకవర్గాల్లోని పార్టీకి చెందిన సీనియర్ నేతలు మాకే అవకాశం కల్పించాలని, తమ సామాజిక వర్గాలను సైతం దరఖాస్తుల్లో ప్రస్పుటించారు. దీం తో పాటు పార్టీకోసం చేపట్టిన కార్యక్రమాలు, ప్ర జాప్రతినిధులుగా అందించిన సేవలతో కూడిన సంపూర్ణ సమాచారాన్ని పార్టీ సమర్పిస్తున్నారు.
గాడ్‌ఫాదర్‌ల ద్వారా ప్రయత్నాలు
ఇదిలా ఉండగా జిల్లా అధ్యక్ష పదవికోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, వి.హన్మంతరావు, కొప్పుల రాజు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ద్వారా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా నెల 13, 14తేదీల్లో రాహుల్‌గాంధీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆ తర్వాతే కొత్త జిల్లాలకు అధ్యక్షుల నియామకం ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా జిల్లా అధ్యక్షులుగా ఉన్నవారు ఎమ్మెల్యేలుగా పోటీ చేయకూడదని అప్పట్లో ప్రకటించిన ఏఐసీసీ.. తన నిర్ణయాన్ని విరమించుకుంది. దీంతో పార్టీలో ఇప్పటికే వివిధ పదవులు అనుభవించిన వారు, ద్వితీయశ్రేణి నాయకత్వంతో పాటు ఎమ్మెల్యే, ఎంపీలుగా పోటీ చేయాలనుకునే వారు సైతం అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. అనుభవం కల్గిన నేతలతో పాటు ఈసారి యువనాయకత్వం పదవిని ఆశిస్తోంది. వీరందరూ ఎవరికి వారే తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment