ఏనుగు జంగారెడ్డి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పరిషత్ కాంగ్రెస్ పక్ష నాయకుడు ఏనుగు జంగారెడ్డి పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై నొచ్చుకున్న ఆయన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కందుకూరు జెడ్పీటీసీగా ప్రాతినిథ్యం వహిస్తున్న జంగారెడ్డి 2014లో జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఆశించారు. తగినంత సంఖ్యాబలం వచ్చినప్పటికీ టీఆర్‌ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో జెడ్పీ పీఠం దక్కలేదు. ఆ తర్వాత జిల్లా కాంగ్రెస్ పార్టీ సారథ్యంపై కన్నేసినా సామాజిక సమీకరణల్లో ఈ పదవి కాస్తా బీసీ వర్గానికి చెందిన క్యామ మల్లేశ్‌కు కట్టబెట్టారు.
ఇటీవల శాసనసభ ఎన్నికల్లో మహేశ్వరం సీటును జంగారెడ్డి ఆశించినప్పటికీ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెర మీదకు రావడంతో మిన్నకుండిపోయారు. అయితే, ఎన్నికల వేళ క్యామ మల్లేశ్ పార్టీ పెద్దలపై ధిక్కార స్వరం వినిపించి టీఆర్‌ఎస్ గూటికి చేరడంతో డీసీసీ కుర్చీ ఖాళీ అయింది. ఈ పోస్టును దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ మహేశ్వరం నియోజకవర్గానికే చెందిన చల్లా నర్సింహారెడ్డి పేరు దాదాపు ఖరారు కావడంతో జంగారెడ్డి నారాజ్ అయ్యారు. పార్టీ కోసం అహర్నిశలు కృషిచేసినా ఫలితంలేకుండా పోయిందని ఆయన తన సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు.
అంతేగాకుండా చల్లా నర్సింహారెడ్డి పేరును మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సిఫార్సు చేయడంతో కినుక వహించిన ఆయన పార్టీని వీడడమే మేలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. గత రెండు రోజులుగా ఈ వ్యవహారంపై సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతున్న జంగారెడ్డి తనకు గుర్తింపులేని పార్టీలో కొనసాగడం కన్నా ప్రత్యామ్నాయం చూసుకోవడమే మంచిదనే భావనకు వచ్చినట్లు తెలుస్తోంది. కష్టకాలంలో పార్టీకి వెన్నంటి నిలిచినా అన్యాయం జరిగిందని ఆయన అనుయాయులతో వాపోయినట్లు సమాచారం. అయితే, పార్టీని వీడాలని భావిస్తున్న జంగారెడ్డి ఏ పార్టీలో చేరుతారనేదానిపై మాత్రం ఇంకా స్పష్టతనివ్వడంలేదు.
Comments
Please login to add a commentAdd a comment