నగరంలో 16 మంది మంత్రగాళ్ల అరెస్టు
చాంద్రాయణగుట్ట:దెయ్యాలు, భూతాల పేరుతో అమాయక ప్రజలను దోపిడీ చేస్తున్న 16 మంది మంత్రగాళ్లను దక్షిణ మండలం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజల మూఢ నమ్మకాలను ఆసరాగా చేసుకొని మంత్రతంత్రాలు చేస్తున్న అడ్డాలపై పోలీసులు మంగళవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో 13 మంది పాత మంత్రగాళ్లు ఉండగా.. ముగ్గురు కరడుగట్టిన మంత్రగాళ్లు ఉన్నారు.
సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డిస్కో బాబా, కంచన్ బాగ్ పరిధిలోని ఫయాజ్ మహ్మద్ అన్సారీ, ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో బండి రామకృష్ణ, డి.యాదయ్య, మహ్మద్ రసూల్‌ఖాన్, నితిన్, షేక్ ఇక్రముద్దీన్, భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సయ్యద్ అన్వర్(42), షాకీర్ అలీ(50), అబ్దుల్ మాజీద్, సమహా మసూర్ అలియాస్ చుమ్మా చావూస్, మొఘల్‌పురాకు చెందిన బల్వీర్ సింగ్(75), ముఖేష్‌కుమార్(33), సంజయ్ కుమార్(33), ఎం.ఎ.రహీం(45), ఖైసర్(22)లను అరెస్ట్ చేశారు.
కాగా ఇందులో కరడుగట్టిన ముగ్గురు మంత్రగాళ్లపై పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు నగర పోలీస్ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపుతామని ఈ సందర్భంగా డీసీపీ తెలిపారు. ఈ రోజుల్లో కూడా మంత్రాలను నమ్మడం సరైంది కాదని ఆయన ప్రజలకు సూచించారు. దక్షిణ మండలం అదనపు డీసీపీ కె.బాబురావు, సంతోష్‌నగర్ ఏసీపీ వి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ఇద్దరూ ఇద్దరే...
హఫీజ్‌బాబానగర్‌కు చెందిన ఫయాజ్ అన్సారీ మత పెద్ద ముసుగులో మంత్రాలు చేస్తున్నాడు. అరబ్ దేశాలలో ఉద్యోగాలు చేసే వారి కుటుంబాలు ఎంచుకొని వారి ఇళ్లలోని పిల్లలకు దెయ్యాలు పట్టాయంటూ నమ్మించి మంత్రాలు చేయడం ఇతని నైజం. ఇంట్లో ఎక్కువగా అల్లరి చేసే పిల్లలను గుర్తించి, వారికి దెయ్యాలు సోకాయని బాగు చేస్తానంటూ చిన్నారులను చిత్రహింసలకు గురి చేస్తాడు. ఒకరిద్దరు మహిళలను కూడా ఇతడు లోబర్చుకున్నాడని పోలీసులు వెల్లడించారు.
టప్పా చబుత్రాకు చెందిన యునాని వైద్యుడు అన్వరుల్లాఖాన్ అలియాస్ డిస్కో బాబా గుప్త నిధులు తీస్తానంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. తన వద్ద ఉన్న ఇత్తడి బిస్కెట్లు, ఆర్టిఫిషియల్ రాళ్లను బంగారం బిస్కెట్లు, వజ్రాలు అంటూ నమ్మించి మోసం చేయడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. రియాసత్‌నగర్‌కు చెందిన సయ్యద్ ఇఫే్తకార్ హుస్సేన్ అనే వ్యక్తి ఇంట్లో గుప్త నిధులు తీస్తానంటూ నమ్మించి రూ.38 లక్షలు వసూలు చేశాడు. ఇతనిపై నగరంలోని ఆసిఫ్‌నగర్, హబీబ్‌నగర్, కుల్సుంపురా, షాయినాయత్ గంజ్ తదితర పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.