పేరోల్ ప్యాకేజీ విధానం అమలు
మచిలీపట్నం (చిలకలపూడి) : ఖజానాశాఖ కార్యాలయాల్లో ఈనెల నుంచి పేరోల్ ప్యాకేజీ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చినట్లు ఖజానాశాఖ డిప్యూటీ డైరెక్టర్ నందిపాటి నాగేశ్వరరావు అన్నారు. జిల్లా పరిషత్ సమావేశపు హాలులో అన్నిశాఖల డ్రాయింగ్ ఆఫీసర్లు, వేతనాలు తయారు చేసే సిబ్బందికి పేరోల్ ప్యాకేజీపై అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ విధానంలో సిబ్బందికి సమయంతో పాటు కాగితాల వాడకం కూడా తగ్గుతుందన్నారు. ఇప్పటి వరకు హెచ్ఆర్ఎంఎస్ విధానంలో జీతభత్యాలు తయారు చేసి బ్యాంకు ఖాతాల వివరాలు జత చేసే వారన్నారు. ఇకపై వీటి అవసరం లేకుండా పేరోల్ ప్యాకేజీ విధానంలో ఉద్యోగి జీతభత్యాలు షెడ్యూల్తో నిమిత్తం లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో ఆన్లైన్ ద్వారా జమ అవుతాయన్నారు. ఈ విధానంలో ఉద్యోగి వేతనాల చెల్లింపులో ఎటువంటి పొరపాట్లు జరిగే అవకాశాలు ఉండదని వివరించారు. ఇప్పటి వరకు మచిలీపట్నం, పెడన, గూడూరు మండలాలకు చెందిన ప్రభుత్వ సిబ్బంది జీతాలు ఈ విధానం ద్వారా అక్టోబరు నెల జీతాలు బ్యాంకు ఖాతాలకు జమ చేయటం జరిగిందన్నారు.