కంగారూలను చంపేస్తున్నారు!
మెల్బోర్న్: ఆస్ట్రేలియా దేశంలో సందర్శనీయ ప్రదేశాలు చాలానే ఉన్నాయి. కానీ, వాటితో పాటు ఒక్కటి చూడకపోతే ఆ టూర్లో ఏదో వెలితిగా ఫీలయ్యే వారు చాలా మంది ఉన్నారు. ఆ ఒక్కటే 'కంగారు'. ఆస్ట్రేలియా ఖండంలో మాత్రమే కనిపించే ఈ జంతువుల సంఖ్యను తగ్గించడానికి ఆ దేశ ప్రభుత్వం పూనుకుంది.
ఇంత అందంగా కనిపించి.. ఒక్క ఉదుటున కొన్ని మీటర్ల దూరం దూకగల ఈ ప్రాణుల సంఖ్య అక్కడి వాతావరణానికి హాని కలుగజేస్తోందట. అందుకే దేశరాజధాని పరిధిలోని నేషనల్ పార్కుల్లో ఉండే 1,991కంగారూలను చంపేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఏటా భారీగా పెరుగుతున్న కంగారుల సంఖ్య వల్ల ఆస్ట్రేలియాలోని వృక్ష సంపద బాగా దెబ్బతింటోంది. కొన్ని ప్రదేశాల్లో అయితే అసలు చెట్లే కనిపించకుండా పోతుండటంతో అక్కడి ప్రభుత్వం గత రెండేళ్లుగా నష్టనివారణా చర్యల కింద కంగరూలను చంపేస్తోంది.
అయితే ప్రతిసారీ ఈ జంతువులను చంపకుండా గర్భం దాల్చకుండా ఉండే పద్దతులపై పరిశోధనలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో మొత్తం 4000 కంగారూలను ప్రభుత్వం చంపించింది.