బియాస్లో మరో మృతదేహం లభ్యం
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్‌నదిలో గల్లంతైన 24 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం జరుపుతున్న గాలింపులో బుధవారం మరో మృతదేహం లభ్యమైంది. దీంతో 18 మంది విద్యార్థుల మృతదేహాలు లభ్యమైనట్టు అధికారులు తెలిపారు. కాగా, బుధవారం లభ్యమైన మృతదేహం రిధిమా పాపానిదిగా గుర్తిం చారు. గల్లంతైన వారిలో ఇద్దరు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలతోపాటు టూర్ ఆపరేటర్ జాడ తెలియాల్సి ఉందన్నారు. రిధిమా మృతదేహాన్ని గురువారం విమానంలో తిరుపతికి పంపిస్తున్నారు. విద్యార్థులందరి మృత దేహాలు కనుగొని వారి తల్లిదండ్రులకు అప్పగించేంత వరకు అక్కడే ఉండాలని పర్యవేక్షణాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
బాధితులకు రూ.5 లక్షల పరిహారమివ్వండి
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నది దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 24 మంది హైదరాబాద్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆ రాష్ట్ర హైకోర్టు బుధవారం ఆదేశించింది. లార్జీ ప్రాజెక్టు నిర్వాహకులు, వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాల యాజమాన్యం కలిసి చెరిసగం చొప్పున ఈ పరిహారం చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్సూర్ అహ్మద్ మిర్, న్యాయమూర్తి జస్టిస్ తర్లోక్‌సింగ్ చౌహాన్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీచేసింది.