ప్రియాంకకు కన్నీటి వీడ్కోలు
కావలి అర్బన్: అమెరికా వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ నగరంలో వారం క్రితం హైక్స్ సరస్సులో పడి మృతి చెందిన గోగినేని ప్రియాంక చౌదరి(25)అంత్యక్రియలు బుధవారం నిర్వహించారు. అమెరికా నుంచి విమానంలో చెన్నైకి చేరుకున్న ప్రియాంక మృతదేహాన్ని ప్రభుత్వం అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో మధ్యాహ్నం కావలి వైకుంఠపురంలోని ఆమె స్వగృహానికి తరలించింది. మృతదేహం తరలింపులో నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్(నాటా), తానా అధ్యక్షుడు వేముల సతీష్, టెక్సాస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగి సుబ్రహ్మణ్యం సహాయపడ్డారు. ప్రియాంక మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, సత్యవతి, సోదరుడు శరత్చంద్ర, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదించారు. అధిక సంఖ్యలో పట్టణ ప్రజలు కూడా మృతదేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించి ఆమె కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. అనంతరం పట్టణంలో ఆమె మృతదేహానికి అంతమ యాత్ర నిర్వహించి దక్షిణ శివారు ప్రాంతంలోని హిందూ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంతమ యాత్రలో పట్టణంలోని పలువురు ప్రముఖులు, ప్రజలు, బంధుమిత్రులు పాల్గొన్నారు.