గోదావరిలో గల్లంతైన ఇద్దరి మృతదేహాలు లభ్యం
రాజమహేంద్రవరం క్రైం :
గోదావరిలో స్నానానికి దిగి గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు శుక్రవారం లభ్యమయ్యాయి. రాజమహేంద్రవరం రూరల్ దివాన్ చెరువు గ్రామానికి చెందిన యందం వెంకట గణేష్ (16), విజయనగరం జిల్లా సాలూరు గ్రామానికి చెందిన, దివాన్ చెరువులోని గైట్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న సిగడపు చైతన్య (19), రాజమహేంద్రవరం రూరల్ శ్రీరామపురం గ్రామానికి చెందిన నిరుకుందల శంకర్, దివాన్ చెరువుకు చెందిన షేక్ గాంధీ, రాజానగరానికి చెందిన చిటికిన సతీష్ కుమార్లు స్నేహితులు. వారు గురువారం మధాహ్నం పుష్కరఘాట్లో స్నానం చేసేందుకు దిగారు. యందం వెంకట గణేష్, సిగడపు చైతన్య స్నేహితులు చూస్తుండగానే గోదావరిలో కొట్టుకుపోయారు. మిత్రులు ఇచ్చిన సమాచారంతో త్రీటౌన్ సీఐ శ్రీ రామ కోటేశ్వరరావు హుటాహుటిన రంగంలోకి దిగి గజ ఈతగాళ్ళను, జాలర్లతో మృతదేహాల కోసం గాలించారు. చివరకు శుక్రవారం ఇద్దరి మృతదేహాలు నది నుంచి బయటకు తీసి పోస్టు మార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు.
బాధితులకు న్యాయం చేయాలని ఆందోళన
మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరుతూ విద్యార్థి సంఘం నాయకులు. ఎమ్మార్పీఎస్ నాయకులు ఆందోళన నిర్వహించారు. పుష్కర ఘాట్ వద్ద గల రోడ్డు పై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం నాయకులు లద్దిక మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.