2 వేల ఎలుకలతో.. అమెరికా పాముల వేట!
ఒకటి కాదు రెండు కాదు చనిపోయిన రెండువేల చిట్టెలుకల్ని కార్డ్‌బోర్డు పారాచ్యూట్స్లలో ఉంచి హెలీకాప్టర్ల ద్వారా ఓ దీవిలో విడిచిపెట్టారు. వీటి ద్వారా విషతుల్యం చేసి పాముల్ని చంపాలన్నది పథకం. ఇది చదువుతుంటే ఏ యానిమేషన్ చిత్రం కోసమే ఈ సీన్ తీసుంటారని భావిస్తారు. అయితే ఇది నిజంగా జరిగిన కథే. విషయమేంటంటే...
అమెరికా ఆధీనంలో ఉన్న గామ్ దీవిలో పాములు పెద్ద సమస్యగా తయారయ్యాయి. అరుదైన పక్షు జాతుల్ని సంహరించడంతో పాటు పవర్‌గ్రిడ్‌కు పెనుసవాల్‌గా మారుతున్నాయి. దీంతో పాముల్ని హతమార్చేందుకు అమెరికా ప్రభుత్వం ఈ ఆపరేషన్ చేపట్టింది. పాములు చనిపోయిన ఎలుకల్ని తినడం వల్ల చనిపోతాయని, ఇతర జంతువులకు పెద్దగా హానీ ఉండదని భావిస్తున్నారు.
చనిపోయిన ఎలుకల్ని తక్కువ ఎత్తు నుంచి హెలీకాప్టర్ల ద్వారా అడవిలో జారవిడిచినట్టు గామ్ వ్యవసాయ శాఖ పర్యవేక్షకుడు డాన్ వైస్ తెలిపారు. ప్రతి ఎలుకని ఒక్కో టిష్యూ పేపర్, కార్డ్‌బోర్డుతో చేసిన చిన్న పారాచ్యూట్‌లో ఉంచుతారు. టిష్యూ పేపర్ కంటే కార్డ్వబోర్డు పెద్దగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటారు. తద్వారా ఇవి అడవిలో చెట్ల వద్ద వేలాడుకుని ఉండటం వల్ల పాములు తినే అవకాశముందని ఆయన తెలిపారు.
ఈ ఆపరేషన్ ఏ మేరకు విజయవంతమవుతుందన్నది కొన్ని రోజులు వేచి చూస్తే కానీ తెలియదు. విజయవంతమైతే గామ్‌లోని ఇతర ప్రాంతాల్లో ఇదే ప్రయోగం చేయనున్నారు. అమెరికా రక్షణ శాఖ 50 కోట్ల రూపాయల బడ్డెట్ లో భాగంగా ఈ ప్రయోగం చేపట్టారు.