జయకు బెయిల్ దక్కేనా?
నేటితో ముగియనున్న గడువు పొడిగింపునకు
సుప్రీంలో జయ పిటిషన్ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ
చెన్నై, సాక్షి ప్రతినిధి: మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత గురువారం మరోసారి వార్తల్లోకి ఎక్కారు. సుప్రీం కోర్టు ఇచ్చిన బెయిల్ గడువు శుక్రవారంతో ముగిసిపోవడమే ఇందుకు కారణం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక ప్రత్యేక కోర్టు జయకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది. ఇదే కేసులో జయతో పాటూ ముద్దాయిలైన శశికళ, సుధాకరన్, ఇళవరసిలకు సైతం నాలుగేళ్ల్ల జైలు శిక్ష, తలా రూ.10 కోట్ల జరిమానా విధించింది. ఈ తీర్పుతో కొన్నాళ్లు జైలు జీవితం గడిపిన జయ సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసి వెలుపలకు వచ్చారు. అలాగే తనకు విధించిన శిక్షపై చేసిన అప్పీలు కర్ణాటక హైకోర్టులో విచారణ దశలో ఉంది.
అప్పీలు దాఖలు చేసిన మూడునెలల్లోగా కేసు విచారణను ముగించి తీర్పు చెప్పాలని సుప్రీం కోర్టు కర్ణాటక కోర్టును ఆదేశించింది. ఈలెక్కన ఏప్రిల్ 18వ తేదీలోగా జయ కేసులో తీర్పు చెప్పాల్సి ఉంది. అయితే, ప్రభుత్వ న్యాయవాది భవానీసింగ్ బదిలీ వివాదం, ఇతర అనేక అవాంతరాల వల్ల మూడునెలల గడువులోగా కేసు ముగింపునకు నోచుకోలేదు. కేసు తీర్పుకు మరో 15 రోజులు గడువు కావాలని కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి, సుప్రీం కోర్టుకు గురువారం లేఖ రాశారు. అలాగే మరోవైపు జయకు ఇచ్చిన బెయిల్ గడువు శుక్రవారంతో ముగిసిపోనుండగా, బెయిల్‌ను పొడింగించాలని జయ తదితరులు సుప్రీం కోర్టులో దాఖలు చేసుకున్న పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది.
కేసులో తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని, అజ్ఞాతవాసం వీడి నిర్దోషిగా అమ్మ జనావసంలోకి వస్తారని ఆశించారు. అయితే కేసులో తీర్పు వెలువడకపోగా, జయ బెయిల్ గడువు ముగిసిపోవడం పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. సుప్రీం కోర్టు బెయిల్‌ను పొడిగించని పక్షంలో అమ్మ మళ్లీ కటకటాల వెనక్కు వెళ్లక తప్పదు. బెయిల్ పొడిగింపు విషయంలో తీర్పు ప్రతికూలంగా వెలువడితే ప్రతిపక్షాలకు మరో అస్త్రంగా మారగలదు. పైగా త్వరలో కోర్టులకు వేసవి సెలవులు దగ్గరపడడం అమ్మ అభిమానులను మరింత టెన్షన్‌ను గురిచే స్తోంది. ఏపీ కాల్పులపై రాష్ట్రం అట్టుడికిపోతున్న తరుణంలో అమ్మ అంశం అధికార పార్టీకి మరో సంకటంగా మారింది. అలాగే ప్రతిపక్షాలు సైతం ఆమ్మ బెయిల్ పొడిగింపుపై ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి.
పాదయాత్ర
జయలలిత మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని ప్రార్థిస్తూ అన్నాడీఎంకే పురసవాక్కం శాఖ నేతలు శుక్రవారం నగరంలో పాదయాత్ర నిర్వహించారు. పురసవాక్కం కాలియమ్మన్ కోయిల్ నుంచి తిరువత్తియూర్ వడివుడ యమ్మన్ కోవిల్ వరకు పాదయాత్ర చేశారు. మార్గమధ్యంలో జోరువాన కురిసినా వెరవక పాదయాత్ర పూర్తిచేశారు. వడివుడ యమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 108 టెంకాయలు కొట్టారు.