స్పృహలోకి ఇంద్రాణి
ముంబయి: షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా స్పృహలోకి వచ్చింది. దీంతో ఇక ఆమె ప్రాణానికి ఎలాంటి ముప్పులేదని వైద్యులు ధృవీకరించారు. తన కూతురు షీనాబోరాను హత్య చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా పరిస్థితి శనివారం అకస్మాత్తుగా విషమంగా మారిన విషయం తెలిసిందే. బైకలా జైల్లో ఉన్న ఆమె కొన్ని మాత్రలు వేసుకున్న వెంటనే ఊపిరి తీసుకోవటం కష్టంగా మారటంతో హుటాహుటిన జేజే ఆస్పత్రికి తరలించారు.
అయితే, ఎంఆర్ఐ స్కాన్ తీసినప్పుడు ఆమె కొన్ని మాత్రలు వేసుకున్నట్లు తేలింది. దీంతో వెంటిలేటర్ ద్వారా ఆమెకు ఆక్సిజన్ అందించారు. కాగా, ఈ కేసు నేపథ్యంలో ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారా? లేక మరేదైనా తెలియని కారణం ఉందా ఊహాగానాలు వచ్చాయి. కానీ, ఆమె ఫిట్స్ నిరోధానికి వైద్యం చేయించుకుంటున్నారని, ఆ మాత్రలను ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, అది కూడా జైలు అధికారుల పర్యవేక్షణలోనే వేసుకోవాలి.కానీ ఆ మాత్రలను అధిక మోతాదులో ఇంద్రాణి వాడటం వల్లే అపస్మారక స్థితిలోనికి వెళ్లారని వైద్యులు అంటున్నారు.