బోల్ భం భక్తుల దుర్మరణం
భువనేశ్వర్: దీక్షయాత్రలో ఉన్న నలుగురు బోల్ భం భక్తులు వేర్వేరు ప్రాంతాల్లో శనివారం జరిగిన ప్రమాదాల్లో దుర్మరణం చెందారు. ఈ ప్రమాదాల్లో మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. మయూర్భంజ్ జిల్లా బంగిరిపొషి పోలీసు స్టేషన్ పరిధి దువార్సుణి గ్రామ ప్రాంతంలో బోల్ భం భక్తులు ప్రయాణిస్తున్న వాహనం ఎదురుగా వస్తున్న భారీ వాహనాన్ని ఢీ కొనడంతో ప్రమాదం సంభవించింది. బలంగీరు జిల్లా గుప్తేశ్వర్ శైవ క్షేత్రానికి బోల్భం భక్తులు వెళ్తుండగా ఎదురుగా దూసుకువస్తున్న లారీని బోల్ భం భక్తుల వాహనం ఢీకొని దాదాపు 10 అడుగుల లోయలోకి పడిపోయింది. దీంతో వాహనంలో ఉన్న ఇద్దరు భక్తులు ఘటనాస్థలంలో తుదిశ్వాస విడిచారు. దుర్మరణం పాలైన బోల్ భం భక్తులను రంజిత్ రామ్, సిబ్బు సాహులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన 8మంది భక్తులను బరిపద ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్చారు. దుర్ఘటన సంభవించిన ప్రాంతంలో స్థానికులు తక్షణమే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఒక ప్రాంతం నదీ తీరం నుంచి జలం సేకరించి వేరే చోట శివాలయంలో జలాభిషేకం నిర్వహించేం దుకు బోల్ భం దీక్షకులు ప్రయాణిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ విషాద సంఘటన సంభవించింది.
సంబల్పూర్ జిల్లాలో ఇద్దరి మృతి
సంబల్పూర్ జిల్లాలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు. బోల్భం భక్తులు ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడడంతో ప్రమాదం జరిగింది. బోల్భం భక్తులు సంబల్పూర్ నుంచి భువనేశ్వర్ వస్తుండగా బస్సు బోల్తా కొట్టింది. గాయపడిన వారందరినీ స్థానిక సంబల్పూర్ ఆస్పత్రిలో భర్తీ చేసి చికిత్స ప్రారంభించారు. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో బుర్లా మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు.