ఎన్ఎఫ్బీఎస్ సాయం స్వల్ప పెంపు
ఒంగోలు టౌన్ : దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబ యజమాని మరణిస్తే ఆ కుటుంబానికి తాత్కాలిక ఉపశమనం కలిగేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ కుటుంబ ప్రయోజన పథకం(ఎన్ఎఫ్బీఎస్) నగదును స్వల్పంగా పెంచింది. ఇప్పటివరకు ఈ పథకం కింద ఐదువేల రూపాయల నగదు అందిస్తుండగా, గతేడాది ఏప్రిల్ నుంచి పదివేల రూపాయల సాయం అందేలా చర్యలు తీసుకుంది. అది కూడా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్రం నుంచి ఠంచనుగా నగదు విడుదల అవుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో సక్రమంగా అమలుకాకపోవడంతో ఈ పథకం ఉండీ ఉపయోగం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈ పథకం కింద సాయాన్ని పెంచడంతోపాటు నేరుగా బాధిత కుటుంబానికే నగదు జమయ్యేలా చర్యలు చేపట్టింది. రెవెన్యూ డివిజనల్ అధికారి తన డివిజన్ పరిధిలో ఎవరైనా కుటుంబ యజమాని మరణిస్తే దానిని ధ్రువీకరిస్తూ ఆన్లైన్ ద్వారా అతని కుటుంబ వివరాలను సెర్ప్ ఉన్నతాధికారులకు పంపాలి. కేంద్రం సూచనలను ఆధారం చేసుకొని ప్రాధాన్యతా క్రమంలో నగదు అందిస్తారు.
ఆ మూడు కేటగిరీల వారికి వర్తించదు
కుటుంబ యజమాని మరణిస్తే మూడు కేటగిరిలకు చెందిన వారికి వర్తించదు. ఆమ్ ఆద్మీ బీమా యోజన, జనశ్రీ బీమా యోజన, ఆపద్బంధు పథకం కింద ఏమైనా ఆర్థిక సాయం పొందిన వారికి జాతీయ కుటుంబ ప్రయోజన పథకం వర్తించదు.
కలెక్టర్ ఆదేశాలతో క్లియర్
ఎన్ఎఫ్బీఎస్ దరఖాస్తులు గతంలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండేవి. అనేకమంది విసుగు చెంది మిన్నకుండేవారు. ఈ నేపథ్యంలో కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన విజయకుమార్ దీనిపై దృష్టి సారించారు. జిల్లాలో కొన్ని నెలల నుంచి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను గుర్తించి బాధిత కుటుంబాలకు యుద్ధప్రాతిపదికన అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
అప్పటికీ కొంతమంది వివరాలు రాకపోతే కొన్నేళ్ల నుంచి మరణించిన కుటుంబ యజమానులను గుర్తించి వారి జాబితాలను సిద్ధంచేసి నగదు అందించారు. 2012 ఆగస్టు నుంచి 2014 ఆగస్టు వరకు ఈ పథకం కింద 13వేల 502మందిని గుర్తించి 5వేల రూపాయల చొప్పున 6కోట్ల 75లక్షల 10వేల రూపాయలు బాధితులకు అందేలా చూశారు.