తోటి విద్యార్థిని కొట్టి చంపేశాడు..
చెన్నై: తమిళనాడులో తిరుపూర్ నగరంలోని ఒక పాఠశాల లో ఆరేళ్ల బాలుడిని తోటి విద్యార్థి కొట్టి చంపాడు. స్థానికులను షాక్‌కు గురి చేసిన ఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది.
సీనియర్ పోలీసు అధికారి అందించిన వివరాల ప్రకారం.... బుధవారం ఉదయం క్లాసులు ప్రారంభానికి ముందే స్కూలు ఆవరణలో ఒకటవ తరగతి విద్యార్థి శివరామ్, మరో విద్యార్థి(12 ) మధ్య ఘర్షణ జరిగింది. దీంతో చిన్నవాడైన శివరామ్‌ను తోటి విద్యార్థి కిందపడేసి దాడి చేశాడు. తీవ్రంగా కొట్టి గ్రౌండ్ నుంచి ఈడ్చుకుంటూ వెళ్లి భవనం వెనుక ఉన్న టాయిలెట్లో పడేశాడు. అక్కడితో ఆగిపోలేదు. శివరామ్ తలని అక్కడున్న పెద్ద రాయికేసి కొట్టి బాదాడు. రక్తమోడుతున్న ఆ బాలుడిని అలాగే వదిలేసి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో శివరామ్, అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. దీన్నిగమనించిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయుడికి సమాచారం అందించారు. శివరామ్ ను తిరుపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
అయితే ఈ మొత్తం సంఘటనను 11 ఏళ్ల అమ్మాయి తరగతి కిటికీలో నుంచి చూడడంతో ఈ దారుణం వెలుగు చూసింది. ఆ బాలిక అందించిన సమాచారం ఆధారంగా పోలీస్ కమిషనర్ ఆధ్యర్వంలో పాఠశాలలో ప్రాథమిక విచారణ నిర్వహించారు. అనంతరం హత్యకేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలుడిపై సెక్షన్ 302 (హత్య) కింద అభియోగాలను నమోదు చేసి జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరు పరిచారు. ఈ సంఘటన తరువాత పాఠశాలకు కొద్ది రోజులు సెలవులు ప్రకటించినట్టు సమాచారం.