పడవ బోల్తా: 108కి చేరిన మృతుల సంఖ్య
కైరో: ఈజిప్టు మధ్యధరా సముద్రంలో శరణార్థులను తీసుకువెళ్తున్న పడవ బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య 108కి చేరింది. ఈ మేరకు ఈజిప్టు ప్రభుత్వం శుక్రవారం ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. దాదాపు 450 మందికి పైగా శరణార్ధులు బోటులో ఉన్నారని ప్రమాదం నుంచి బయటపడిన వ్యక్తులు చెబుతున్నారు. మిగిలిన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
మరణించిన వారి శవాలను ఈజిప్టు మిలటరీ బలగాలు పడవల ద్వారా ఒడ్డుకు చేరుస్తున్నాయి. కాగా ప్రమాదం జరిగిన వెంటనే బోటులో ప్రయాణిస్తున్న శరణార్ధుల్లో 150మందిని కోస్ట్ గార్డు సిబ్బంది రక్షించారు. మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కొందరు అధికారులు అంటున్నారు. మృతులు ఈజిప్ట్, సిరియా, సుడాన్, సోమాలియా దేశాలకు చెందిన వారని వెల్లడించారు.
గత కొంతకాలంగా యూరప్ దేశాలకు వలస వెళ్లేందుకు శరణార్ధులు మధ్యదరా సముద్రంపై ప్రమాదకర ప్రయాణాన్ని ఎన్నుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది యూఎన్ లెక్కల ప్రకారం ఇప్పటికే మధ్యదరా సముద్రంలో మరణించిన శరణార్ధుల సంఖ్య రికార్డు స్ధాయికి చేరింది. బోటులను అక్రమంగా నడుపుతున్న ట్రాఫికర్లు బోటు సామర్ధ్యం కంటే ఎక్కువమందిని రవాణా చేయడానికి ప్రయత్నిస్తుండటమే ప్రమాదాలకు ప్రధాన కారణమని తెలుస్తోంది.