అప్పు సీలింగ్ రూ. 15,295 కోట్లు
సాక్షి, హైదరాబాద్: వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ తదితర పథకాలకు నిధుల సమీకరణలో ఉన్న తెలంగాణ సర్కార్‌కు కేంద్రం ‘అప్పుల సీలింగ్’ విధించింది. రూ. 15,295 కోట్లకు మించి అప్పులు చేయవద్దంటూ కళ్లెం వేసింది. 2015-16 వార్షిక సంవత్సరంలో అప్పుల సీలింగ్‌కు సంబంధించి కేంద్రం ఈ మేరకు లేఖ విడుదల చేసింది. అంటే.. జీఎస్డీపీలో 3 శాతానికి పరిమితం చేసింది. 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు ఈ సీలింగ్‌ను విధించినట్లు అందులో పేర్కొంది.
కొంతకాలంగా ఎఫ్ఆర్బీఎం నిబంధనలు సడలించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేస్తోంది. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన నీతి అయోగ్ బృందం సభ్యులతోనూ సీఎం కె.చంద్రశేఖరరావు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఢిల్లీలో వివిధ రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రుల సమావేశంలోనూ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఈ అంశాన్ని లేవనెత్తారు. కానీ, కేంద్రం ప్రభుత్వం రాష్ట్రం చేసిన విజ్ఞప్తిని ఏమాత్రం పట్టించుకున్నట్టు లేదు.
అంచనాలకు అడ్డ కత్తెర..!
తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది వార్షిక బడ్జెట్టులో రూ.16,969 కోట్లు ద్రవ్యలోటు చూపించింది. జీఎస్డీపీలో 3.49 శాతం రుణాలు తెచ్చుకునే అంచనా వేసింది. కానీ.. తాజా సీలింగ్ ప్రకారం అందులో రూ.1,674 కోట్లు కోతపడడంతో అంచనాలు తలకిందులయ్యాయి. వార్షిక ఆదాయపు అంచనాలపై ఈ ప్రభావం పడడం ఖాయంగా కన్పిస్తోంది. 14వ ఆర్థిక సంఘం తెలంగాణను రెవెన్యూ మిగులు రాష్ట్రంగా గుర్తించింది. దీంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నింటికీ కత్తెర పడింది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పథకాలకు భారీ మొత్తంలో నిధులు అవసరముంది. దీంతో రుణ సమీకరణ తప్పనిసరిగా మారింది. అందుకే ఎఫ్ఆర్బీఎం వెసులుబాటుకు సర్కారు పట్టువీడకుండా ప్రయత్నాలు చేసింది. జీఎస్డీపీలో 3.9 శాతం వరకు ద్రవ్యలోటుకు అనుమతిస్తే.. రూ.18,962 కోట్లు రుణంగా తెచ్చుకొని బడ్జెట్టులో లోటు పూడ్చుకోవచ్చని ఆరాట పడింది. కానీ.. అదేమీ పట్టించుకోకుండా కేంద్రం సీలింగ్ విధించడం గమనార్హం.